Online Coaching: స్వేచ్చ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో అక్షరదాన ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అక్షరమాల’ పేరుతో రాబోయే మూడేళ్లపాటు అంటే 2026-27 నుంచి 2028-29 వరకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ తరగతులను నిర్వహించనుంది. ఈ ఉత్తర్వులను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు గ్రామీణ విద్యార్థులకు వలంటీర్లుగా వ్యవహరించి బోధన అందిస్తారు.
కనెక్ట్ విత్ జెమ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా 10వ తరగతి విద్యార్థుల కోసం గణితం, భౌతిక శాస్త్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు/సెప్టెంబర్ నుంచి నవంబర్/డిసెంబర్ వరకు వారానికి రెండు గంటల పాటు ఈ తరగతులు జరుగుతాయి. 8వ తరగతి విద్యార్థుల కోసం అక్టోబర్/నవంబర్ నెలల్లో 3 వారాల పాటు ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్’ పరీక్షపై శిక్షణ అందించనున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నెలకొకసారి మోటివేషనల్ సెషన్లు, కెరీర్ గైడెన్స్, జెండర్ సెన్సిటైజేషన్ తరగతులు నిర్వహిస్తారు.
Also Read: Vijay Oath: జోసఫ్ విజయ్ ఎనుం నాన్.. తమిళనాడు సీఎంగా, రాష్ట్రానికి సరికొత్త శకం ప్రారంభం
బోర్డు పరీక్షలకు ముందు క్లిష్టమైన అంశాలపై 10 రోజుల పాటు ప్రత్యేక సందేహ నివృత్తి సెషన్లు ఉంటాయి. కాగా తొలి దశలో జిల్లాల్లోని ఇంటర్నెట్ సదుపాయం ఉన్న 10 గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు అందులో కుమురం భీమ్ ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి.. అక్కడ రాకపోకలు బంద్..?