Livestock Policy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్నా.. పశుసంవర్ధక రంగానికి అవసరమైన దీర్ఘకాలిక, సమగ్ర విధానాల రూపకల్పనలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. పశుగ్రాసం నుంచి పశువుల బ్రీడింగ్ వరకు.. పాల ఉత్పత్తి నుంచి గుడ్లు, మాంసం మార్కెటింగ్ వరకు.. ప్రతి అంశానికి వేర్వేరు కార్యక్రమాలు, పథకాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఒకే దీర్ఘకాలిక విధానంగా మలిచే ప్రయత్నం ఎంతవరకు జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పష్టమైన విధివిధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడంతో లక్షలాది మంది పశుపోషకులు, పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం అధికారుల అలసత్వం, ఉదాసీన వైఖరి కారణంగా కోట్లాది రూపాయల నిధులు వెనక్కి వెళ్తున్న దుస్థితి నెలకొంది.
సమగ్ర ‘లైవ్‌స్టాక్ పాలసీ’ ఎక్కడ?
పశుసంవర్ధక శాఖ ప్రధాన లక్ష్యాల్లో పాలు, మాంసం, గుడ్ల లభ్యతను శాస్త్రీయ బ్రీడింగ్, ఫీడింగ్, వ్యాధుల నియంత్రణ. రాష్ట్రంలో 2,160 పశువైద్య సంస్థలు, 1,270 మంది గ్రాడ్యుయేట్ వెటర్నరీ వైద్యులు, 2,091 మంది పారా వెటర్నరీ సిబ్బంది..ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్ర పశుసంపద రంగానికి వచ్చే 10–20 ఏళ్ల దిశను నిర్దేశించే సమగ్ర ‘లైవ్‌స్టాక్ పాలసీ’ ఎక్కడ? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
పాలసీలేవీ?
పశుపోషణకు ప్రాణాధారం పశుగ్రాసం. కానీ రాష్ట్రంలో ఏటా పచ్చిమేతలో 30–40 శాతం వరకు లోటు ఉంటుందని అధికారిక లెక్కలే పేర్కొంటున్నాయి.కానీ ఎండాకాలంలో పశువులకు దాణా, గడ్డి కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక పశుగ్రాస (ఫోడర్) పాలసీ లేదు. పశువుల సంఖ్య పెరగడం కంటే వాటి ఉత్పాదకత పెరగడమే కీలకం. కృత్రిమ గర్భధారణ, నాణ్యమైన సీమెన్, స్థానిక జాతుల పరిరక్షణ, అధిక పాల దిగుబడి ఇచ్చే జాతుల అభివృద్ధి.. ఇవన్నీ సమన్వయంతో సాగాలి.శాఖ వద్ద 1,334 మంది గోపాలమిత్రుల ద్వారా ఇంటింటికీ కృత్రిమ గర్భధారణ సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ నాణ్యమైన వంశోద్ధ్దరణ, జాతుల అభివృద్ధికి పకడ్బందీ బ్రీడింగ్ పాలసీ విధానం కాగితాలకే పరిమితమైంది.‘మిల్క్ పాలసీ’ అంటే పాల ఉత్పత్తి పెంచడమే కాకుండా.. ఉత్పత్తి వ్యయం తగ్గించడం, రైతుకు స్థిరమైన మార్కెట్ కల్పించడం, ప్రాసెసింగ్ పెంచడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ అధికారుల చోద్యం కారణంగానే పాలసీని రూపొందించలేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకం గ్రామీణ కుటుంబాలకు ముఖ్యమైన ఆదాయ వనరులు. కానీ ఈ రంగాల్లో కూడా ఉత్పత్తి–మార్కెట్ మధ్య అంతరం ఉంది.గుడ్డు ఉత్పత్తిదారులకు ఫీడ్ ధరలు, మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రధాన సమస్యలైతే.. గొర్రెలు, మేకల పెంపకందారులకు దాణా, జాతి అభివృద్ధి, వ్యాధుల నియంత్రణ, మార్కెట్ ధరలు కీలకం.ఒక జిల్లాలో అమలయ్యే కార్యక్రమం మరో జిల్లాలో కనిపించకపోవడం, పథకాల రూపకల్పనలో శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలను అధిగమించాలంటే ఎగ్, మటన్ రంగాలకు కూడా స్పష్టమైన రాష్ట్రస్థాయి కార్యాచరణ అవసరం.
ఇతర రాష్ట్రాల వైపే చూపు?
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పశుసంవర్ధక విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించాల్సిన పరిస్థితి ఉంది.కానీ తెలంగాణకు ప్రత్యేకమైన వాతావరణం, పశుగ్రాస పరిస్థితులు, స్థానిక జాతులు, రైతుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వంత పాలసీ రూపొందించడమే దీర్ఘకాలిక పరిష్కారం. కానీ ఆదిశగా 12ఏళ్లుగా అడుగులు పడటం లేదు.
నిధులున్నా.. వినియోగమెంత?
పశుసంవర్ధక రంగానికి కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా నిధులు అందుబాటులో ఉంటున్నాయి. 2025-26లో పశువైద్య సేవలు, జంతు ఆరోగ్యం, జాతీయ పశుసంపద నిర్వహణ కార్యక్రమం, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి పథకం తదితరాలకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వెటర్నరీ సర్వీసెస్, నేషనల్ లైవ్‌స్టాక్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం, నేషనల్ ప్లాన్ ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక కేటాయింపులు నమోదయ్యాయి.అయితే కేటాయింపులు ఉండటం లేదు.. వాటిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ఖర్చు చేసి ఫలితాలు సాధించడం వేరు. ఏ పథకానికి ఎంత కేటాయించారు? ఎంత విడుదలైంది? ఎంత ఖర్చయింది? ఎంత మిగిలింది? అనే అంశాలపై శాఖ స్థాయిలో నిరంతర సమీక్ష, బాధ్యత నిర్ధారణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్‌చార్జులతోనే కీలక పోస్టులు?
శాఖలో ఉన్నతస్థాయి పోస్టుల నిర్వహణపైనా విమర్శలు వస్తున్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం డైరెక్టర్(FAC)గా డాక్టర్ బి.గోపి, అదనపు డైరెక్టర్(FAC)గా డాక్టర్ బి.సుబ్బారాయుడు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు అదనపు బాధ్యతల్లో ఉండటంతోనే పశుగ్రాసం, బ్రీడింగ్, పాలు, గుడ్లు, మాంసం ఇలా దేనికీ పాలసీని రూపొందించడం లేదనే ఆరోపనలు వస్తున్నాయి. వారికి ఇతర శాఖల బాధ్యతలతోనే సరిపోతుందని ప్రచారం జరుగుతుంది. పూర్తిస్థాయి అధికారులను నియమిస్తేనే పాలసీలకు రూపకల్పన జరిగి అమలులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పశుపోషకుడికి కావాల్సింది ఇదే..
పశుగ్రాసానికి శాశ్వత ప్రణాళిక, జాతి అభివృద్ధికి దీర్ఘకాలిక బ్రీడింగ్ పాలసీ, పాల రైతుకు ఉత్పత్తి–మార్కెట్ భరోసా, పౌల్ట్రీకి ఫీడ్, మార్కెట్ స్థిరత్వం,గొర్రెలు–మేకలకు బ్రీడింగ్, మాంసం మార్కెటింగ్ వ్యవస్థ, కేటాయించిన నిధులకు పూర్తిస్థాయి వినియోగం.పథకాల అమలుపై ఫలితాల ఆధారిత సమీక్ష.
పాలసీ ఎప్పటికి?
తెలంగాణలో పశుసంపద రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదే. ప్రభుత్వం కూడా పాలు, మాంసం, గుడ్ల లభ్యతను పెంచడమే శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తోంది.వచ్చే ఐదేళ్లు, పదేళ్లలో పశుసంపద రంగాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? పశుపోషకుడి ఆదాయాన్ని ఎంత పెంచాలి? పశుగ్రాస లోటును ఎలా అధిగమించాలి? స్థానిక జాతులను ఎలా కాపాడాలి? పాలు, గుడ్లు, మాంసానికి విలువ ఆధారిత మార్కెట్లు ఎలా సృష్టించాలి? అనే ప్రశ్నలకు ఒకే సమగ్ర పాలసీ, స్పష్టమైన లక్ష్యాలు, నిర్దిష్ట గడువులు అవసరం.నిధులు కేటాయించడం.. పథకాలు ప్రకటించడం.. అధికారులు సమీక్షలు నిర్వహించడం మాత్రమే కాదు. చివరకు పశుపోషకుడి చేతిలో మిగిలే ఆదాయం ఎంత పెరిగిందన్నదే పాలసీ విజయానికి కొలమానం. పశుసంపద రంగానికి ఇకనైనా దీర్ఘకాలిక దిశానిర్దేశం ఉంటుందా? లేక మరో బడ్జెట్.. మరో పథకం.. మరో ప్రకటనతోనే సరిపెడతారా? అన్నది ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉంది.