MeeSeva Door Delivery: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప అడుగు వేసింది. పౌరులు ఇకపై మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. నేరుగా ఇంటి నుంచే సేవలు పొందేలా ‘మీసేవ డోర్ డెలివరీ సర్వీసెస్’ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ప్రారంభమైన ఈ విధానం పౌర సేవల్లో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.
సేవలు ఎలా పొందాలి?
ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం చాలా సులభం. ప్రజలు 1100 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కానీ, లేదా అధికారిక మీసేవ పోర్టల్ ద్వారా గానీ తమకు అనుకూలమైన సేవల్ని ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్న సమయానికి మీసేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా మీ ఇంటికే వస్తారు.
ఇంటి వద్దకే లభించే పౌర సేవలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా మీసేవలో లభించే దాదాపు అన్ని ముఖ్యమైన సర్టిఫికేట్లు, సేవలు ఇంటి వద్దకే అందుతాయి. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఈసీ కాపీలు , ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ సేవలు, పోలీసు శాఖకు సంబంధించిన వివిధ సేవలు నేరుగా ఇంటి వద్దకే అందుతాయి.
ప్రత్యేక శిక్షణ , విస్తరణ ప్రణాళిక
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన సేవలు అందించేందుకు తొలిదశలో 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లు, వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ప్రస్తుతం తొలి దశలో భాగంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా, త్వరలోనే ఈ డోర్ డెలివరీ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను, సమయాన్ని ఆదా చేసే ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!