Telangana Municipal: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. సోమవారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు కలిపి 112 పాలక మండలిల ఎన్నిక ఆసక్తికరమైన రాజకీయ పరిణామాల మధ్య ముగిసిన సంగతి తెల్సిందే. మగిలిన 11 మున్సిపాల్టీల్లో పాలక మండలిని ఎన్నుకునే ప్రక్రియను మంగళవారం చేపట్టగా, ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న హోరాహోరీ పోరుతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వీటిలో ఎనిమిది మున్సిపాల్టీలకు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లను ఎన్నకోగా, వీటిలో ఏడు మున్సిపాల్టీల పీఠాలను అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగా, ఒక మున్సిపాల్టీ స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. మంగళవారం జరిగిన మున్సిపాల్టీల పాలక మండలి ఎన్నిక ప్రక్రియలో భాగంగా హైడ్రామా చోటుచేసుకుంది.
జనగామ, తొర్రూరు మున్సిపాల్టీల స్థానాన్ని హస్తం పార్టీ డ్రా ద్వారా హస్తగతం చేసుకుంది. మంగళవారం జరిగి ఎనిమిది మున్సిపాల్టీల పాలక మండలి ఎన్నికల్లో కాంగ్రెస్-7, బీఆర్ఎస్-1 స్వాధీనం చేసుకున్నాయి. జహీరాబాద్, ఇల్లందు, కాగజ్ నగర్, డోర్నకల్, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఇంద్రేశంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. మంచిర్యాలలో మంత్రి శ్రీధర్ బాబు వాహనంపై రాళ్లదాడి జరగటంతో ఉద్రికత చోటుచేసుకుంది. తొర్రూరులో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాలోత్ కవిత లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం ఫలితంపై హైకోర్టు స్టే ఇవ్వటంతో అక్కడ అప్పటికే ఎన్నుకున్న చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు అధికారులు సర్టిఫికెట్లు జారీ చేయలేదు. కాగజ్ నగర్ మున్సిపాల్టీ స్థానాన్ని బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఇబ్రహీంపట్నం, క్యాతన్ పల్లి, ఖానాపూర్ మున్సిపాల్టీల్లో పాలక మండలి ఎన్నిక వాయిదా పడింది.
జనగామ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్కంఠ పోరుతో దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో ఓట్లు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా 16/16 ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో కాంగ్రెస్ కౌన్సిలర్ బాలమణి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ లక్కీ డ్రా ఫలితంపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించుకున్నాయి. మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపినప్పటికీ, సరిగ్గా అదే సమయంలో హైకోర్టు నుంచి ఎన్నికపై స్టే వచ్చింది. దీంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. చైర్మన్ ఎన్నిక పూర్తయిందని మీడియాకు చెప్పేందుకు వచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను అధికారులు లోపలికి పంపించేశారు.
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ కుదరడంతో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి సుల్తానా షాహిన్ విజయం సాధించారు. బీజేపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. జహీరాబాద్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్ మోహ్మద్ యూనుస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 39 ఓట్లకు గాను ఆయనకు 20 మంది మద్దతు లభించింది.
Also Read: Madanapalle Girl Incident: మదనపల్లిలో చిన్నారి ఘటన కేసు.. నిందితుడు మృతి, చెరువులో మృతదేహం!