Vemula Veeresham: కాళేశ్వరం నిర్మాణం వెనుక అసలు రహస్యం కేవలం కాసుల కక్కుర్తేనని, ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదిలాబాద్ రైతులకు తీరని అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌లో కేటీఆర్ నిర్వహించిన పర్యటన పూర్తిగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారంతో నిండిపోయిందని, పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆయన ధ్వజమెత్తారు.
నాటకాలు కట్టిపెట్టి సవాల్ స్వీకరించాలి
కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్‌లా వ్యవహరిస్తున్నారని వేముల వీరేశం విమర్శించారు. గడ్డం, మీసం పెంచినంత మాత్రాన కేటీఆర్.. రేవంత్ రెడ్డి కాలేరని, కేవలం వేషం, భాష మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఆయన తప్పులను క్షమించరని స్పష్టం చేశారు. ‘మీ నాన్న కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకోరండి.. రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్‌నినో పరిస్థితులపై నేరుగా చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు?’ అని వేముల వీరేశం సవాల్ విసిరారు.
రైతు ప్రేముంటే ఆ 1500 కోట్లు ఇవ్వండి
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ప్రస్తుతం 1500 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని, రైతులపై అంత ప్రేమ ఉంటే ఆ డబ్బును వెంటనే రైతాంగ సంక్షేమం కోసం ఖర్చు చేయాలని వేముల వీరేశం డిమాండ్ చేశారు. పదేళ్ల కాలంలో నియంతృత్వం, అక్రమ అరెస్టులతో రాష్ట్రాన్ని ఏలిన వారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణను ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబం కోట్లు కూడబెట్టుకుందని, పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read: నాన్న అరెస్ట్ తట్టుకోలేకపోయాను..పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్!