College Strike: తెలంగాణ ప్రభుత్వంపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, “ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య” (ఫెడరేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్) సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది.
దీపావళి నాటికి రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు కేవలం రూ. 360 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, తమ డిమాండ్ల సాధనకే బంద్ పిలుపునిచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు రూ. 10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI
తమ నిరసనను, ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేయనున్నట్లు సమాఖ్య ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.నవంబర్ 4న మొదటి దశలో భాగంగా, రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలందరినీ యాజమాన్య ప్రతినిధులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు (రిప్రజెంటేషన్) సమర్పిస్తారు.
నవంబర్ 6న ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు లక్ష మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు ఇతర సిబ్బందితో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 10న ఉద్యమంలో భాగంగా పది లక్షల మంది విద్యార్థులతో ‘లాంగ్ మార్చ్’ నిర్వహించి, ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ ఆందోళనలపై సర్కారు స్పందించని పక్షంలో, రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాకుండా, ప్రభుత్వం తమ సంస్థలపై జరుపుతున్న విజిలెన్స్ దాడులకు భయపడబోమని, తమ హక్కుల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తేల్చి చెప్పింది.