Dreambeans AI App: మనకు నచ్చే విషయాలు, వెళ్లాలనుకునే ప్రదేశాలు, మర్చిపోకూడని పనులు.. ఇవన్నీ ఒకేచోట ఆసక్తికరమైన కథల రూపంలో కనిపిస్తే ఎలా ఉంటుంది? గూగుల్ తీసుకొచ్చిన ‘డ్రీమ్‌బీన్స్’ యాప్ ఇదే పని చేయనుంది. అమెరికాలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ యాప్‌ను ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఏఐ సాయంతో ప్రతి రోజూ వ్యక్తిగత అభిరుచులకు తగ్గ కథలను రూపొందించడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా, కొత్త విషయాలు తెలుసుకోవడానికి పదే పదే ఫీడ్స్ స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది.
Dreambeans సాధారణ వార్తలు చూపించే యాప్ కాదు. మీరు ఎంచుకున్న గూగుల్ సేవల్లోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుని రోజూ కొత్త కథల సేకరణను తయారు చేస్తుంది. ఉదా: మీకు నచ్చే ప్రదేశాలు, కళలు, చేతితో చేసే పనులు, దగ్గర్లో జరగబోయే కార్యక్రమాలు, క్యాలెండర్‌లో ఉన్న ముఖ్యమైన పనుల గురించి కథలు చూపించవచ్చు. ఒక్కో కథను తెరిచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. నచ్చిన కథలను తర్వాత చదవడానికి సేవ్ చేసుకోవచ్చు. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.
Also Read: స్టీవ్ జాబ్స్ రూల్స్‌ను బ్రేక్ చేసిన యాపిల్.. M7 చిప్‌లతో తిరుగులేని టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్స్!
ఈ యాప్‌కు జీమెయిల్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ ఫొటోస్, గూగుల్ సెర్చ్, జెమిని, యూట్యూబ్ వంటి సేవల నుంచి సమాచారం అందుతుంది. యాప్‌ను మొదటిసారి తెరిచినప్పుడు అందుబాటులో ఉన్న సేవలను చూసి, మీకు అనుకూలమైన వాటిని మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. అవసరమైతే ఈ ఎంపికలను తర్వాత కూడా మార్చుకోవచ్చు. అయితే, ఏ సేవల సమాచారాన్ని ఉపయోగించాలనేది వినియోగదారులే ఎంచుకోవచ్చు. అంటే అన్ని ఖాతాల సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన సేవల ఆధారంగా మీకు ఉపయోగపడే విషయాలను యాప్ ముందుగానే గుర్తించి చూపిస్తుంది. ఏదైనా కథ నచ్చకపోతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. దాని ఆధారంగా కథలను మరింత మెరుగుపరచే ప్రయత్నం జరుగుతుంది.
Dreambeansలో మరో ఆసక్తికరమైన సదుపాయం కూడా ఉంది. కొన్ని కథల్లో కనిపించే ఫొటోలను కదిలే వీడియోలుగా మార్చగలదు. ఇందుకోసం గూగుల్‌కు చెందిన Veo వీడియో తయారీ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సదుపాయం అన్ని కథల్లోనూ ఉండదు. ఎంపిక చేసిన కథల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
డ్రీమ్‌బీన్స్ యాప్‌ను ఉపయోగించాలంటే 18 ఏళ్లు నిండాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు సహా మొత్తం 14 భాషలకు మద్దతు ఉంది. అయితే ఒకేసారి ఒక భాషలోనే కథలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. జూన్‌లో అమెరికాలో మొదలైన ఈ ప్రయోగం.. ఇప్పుడు భారత్‌కు విస్తరించింది. అమెరికా తర్వాత అంతర్జాతీయంగా ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తొలి దేశం భారత్ కావడం విశేషం. రోజూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
Also Read: ఎవరూ ఊహించని రేంజ్‌లో నథింగ్ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది మార్కెట్లోకి 7 ఫోన్‌లు!