Minister Sridhar Babu : రాష్ట్ర అభివృద్ది, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, ఈ విజన్ పాలసీ లక్ష్యాలు, ప్రణాళికలపై ఆయన కీలక వివరాలు వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ.. 2037 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం తక్షణ లక్ష్యమని తెలిపారు. ఇక 2047 నాటికి, దేశం స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తిచేసుకునే సమయానికి, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తుది లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికే తెలంగాణ రైజింగ్–2027 పాలసీ డాక్యుమెంట్‌ను కూడా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రణాళికల్లో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా ఉండేలా సమతుల్యత పాటిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఈ విజన్ డాక్యుమెంట్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు పునాది వేస్తుందని మంత్రి అన్నారు. అందుకే దీనిని కేవలం ప్రభుత్వ నిర్ణయంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో రూపొందిస్తున్నామని వివరించారు. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ప్రజల నుంచి సూచనలు సేకరించామని, ముఖ్యంగా యువత నుంచి వచ్చిన ఆలోచనలు, నవీనతతో కూడిన ప్రతిపాదనలు ఈ విజన్ రూపకల్పనలో కీలక మారాయని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాతే తుది విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని ఎలా సాధ్యం చేయాలి అనే అంశంపై.. ఇప్పటికే ప్రభుత్వ బృందాలు విస్తృత స్థాయిలో అధ్యయనం చేశాయని మంత్రి తెలిపారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, స్టార్టప్ రంగం వంటి అనేక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు హాజరవుతారని తెలిపారు. పెట్టుబడులతో పాటు తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడే కీలక సూచనలు, సలహాలు కూడా ఈ వేదిక నుంచి వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ లక్ష్యాలు కేవలం పేపర్లపైనే కాకుండా అమలులో కూడా కనిపించాలన్నదే తమ విధానమని మంత్రి స్పష్టం చేశారు. మాటల్లో మాత్రమే హామీలు ఇవ్వడం కాదు.. వాటిని చేతల్లో చూపించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకతగా కొనసాగుతుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు భరోసా, మహిళలకు సాధికారత, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు.
Also Read: తెలంగాణ రైజింగ్-2047.. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు
తెలంగాణ రైజింగ్–2047 అనేది కేవలం ఒక విజన్ డాక్యుమెంట్ మాత్రమే కాదని, ఇది తెలంగాణ భవిష్యత్తును రూపకల్పన చేసే మార్గదర్శక శిలాశాసనమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే తరాలకు స్వావలంబన, ఆర్థిక భద్రత, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడమే ఈ విజన్ యొక్క తుది లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.