TG Rythu Commission Meeting: విత్తనాలు సరఫరా చేసే నిర్వాహకులు మొక్కజొన్న సాగు చేసే రైతులను నిట్ట నిలువునా ముంచేశారు. ఎప్పటి మాదిరిగా పంటకు సరైన దిగుబడి రాలేదు. రైతుల ఆవేదనపై ‘బిగ్ టీవీ’ రంగంలోకి దిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనిపై వరుసగా కథనాలు ప్రసారం చేసింది. చివరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రైతు కమిషన్ ముందు అధికారులు, రైతులు హాజరయ్యారు.
అసలేం జరిగింది?
ములుగు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతంలో మొక్క జొన్న పంటను భారీగా రైతులు వేశారు. దాదాపు ఐదు నుంచి ఆరు వేల ఎకరాల్లో వేశారు. నార్మల్‌గా ఎకరానికి మూడు టన్నుల పైగా మొక్కజొన్న పంట దిగుబడి వచ్చేది. ఈసారి మాత్రం ఎకరానికి ఒక టన్ను మాత్రమే వచ్చింది. తాము మోసపోయామని రైతులు గ్రహించారు. ఈ విషయం తెలియగానే ‘బిగ్ టీవీ’ అక్కడికి వెళ్లింది. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కమిషన్‌తో రైతులు సమావేశం
చివరకు జన్యు మార్పిడి విత్తనాల వల్లే ఈ సమస్య ఏర్పడిందని తేలింది. దీనిపై వరుసగా కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైతు కమిషన్ సభ్యులు ములుగు వెళ్లారు. నేరుగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి వ్యవసాయ అధికారులు, రైతులతో సమీక్ష నిర్వహించింది. రైతు కమిషన్ సభ్యులు వస్తున్న విషయంతో తెలియడంతో మొక్కజొన్న సాగు బాధిత రైతులు చేరుకున్నారు.
అధికారులు కేవలం 15 మంది రైతులను మాత్రమే సమావేశానికి అనుమతించారు. మిగతా రైతులంతా కలెక్టర్ ఆఫీసు బయట ఉండిపోయారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విత్తనాలు ఇచ్చేటప్పుడు నిర్వాహకులు చెప్పిన విషయాలను కమిషన్ ముందు వెల్లడించారు.
ALSO READ: ఆసుపత్రిలో మంత్రి శ్రీధర్‌బాబు.. కంటతడి ఎందుకంటే?
రైతులను ముంచేసిన నకిలీ విత్తనాలు
నష్టపోయిన పంటకు పరిహారం ఇస్తామని చెప్పారని అంటున్నారు రైతులు. ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారని, కోత సమాయానికి కేవలం టన్ను మాత్రమే వచ్చిందన్నారు. ఈ విషయాన్ని విత్తనాలు అందించే నిర్వాహకులు చెప్పారని వివరించారు. నకిలీ విత్తనాలపై తమకు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. ప్రతీ ఏటా ఇస్తున్నారని, ఈసారి కూడా ఇచ్చారన్నారు.
విత్తనాలు ఇచ్చే కంపెనీ ఏంటో తమకు తెలీదన్నారు రైతులు. ఒకవేళ ఊహించిన దిగుబడి రాకుంటే నష్టపరిహారంగా మూడు టన్నులకు వచ్చే మొత్తం, ఆపై 90 వేలు ఇస్తామని చెప్పారని వివరించారు రైతులు. ప్రతీ ఎకరాకి మూడు టన్నుల దిగుబడి వచ్చేదని అంటున్నారు. జన్యు మార్పిడి విత్తనాల వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్
ఆ తర్వాత గ్రామానికి వ్యవసాయ అధికారులు, నిపుణులు వచ్చి పరిశీలించారని అంటున్నారు రైతులు. ఈ తరహా విత్తనాల వల్ల మనుషులు కాదు, జంతువులకు డ్యామేజ్ కలుగుతుందన్నారు. తమకు పంటకు ఇచ్చే నష్టంతోపాటు ఆపై 90 వేలు ఇస్తామని చెప్పారని వివరించారు. మరి రైతు కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.