Mahesh Kumar Goud: తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి బిజెపి, బిఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపు పేరుతో ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్నారని ఆరోపించారు.
బిఆర్ఎస్ మౌనం వెనుక బీజేపీ భయం
రాష్ట్రంలో SIR వల్ల దాదాపు 90 లక్షల మందికి పైగా అర్హులైన ఓట్లు తొలగించే ముప్పు పొంచి ఉన్నా, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎందుకు రోడ్డెక్కడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, ఫార్ములా-ఈ కార్ రేసింగ్ స్కాముల్లో ఎక్కడ జైలుకు పంపుతారోనన్న భయంతోనే కేసీఆర్, కేటీఆర్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపిలు లోపాయికారీ ఒప్పందంతో రాజకీయం చేస్తున్నాయని, కిషన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్లే SIRపై బిఆర్ఎస్ నిరసనలు తెలపడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
దళితులు, మైనారిటీల ఓట్లకు గండి
ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని పీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని, బీహార్ లో ఆర్‌జేడీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బిజెపి ఎలాంటి కుట్రలు చేసిందో, ఇప్పుడు తెలంగాణ, పంజాబ్‌లను లక్ష్యంగా చేసుకుని అదే వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు.
అధికారుల లోపాలు.. కాంగ్రెస్ పోరాటం
రాష్ట్ర సీఈసీ తీవ్రమైన తప్పిదాలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో బిఎల్ఓలకు ఇచ్చే ఫారాల లెక్కింపులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ లాంటి వారి తొలగింపు వరకు తమ నిరసన ర్యాలీలు ఆగవని తేల్చిచెప్పారు. టీఎన్ శేషన్, లింగ్డో వంటి నిష్పాక్షిక అధికారుల కాలంలో ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటును కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
Also Read: అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!