Heavy Rain: గత మూడు, నాలుగు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. అంతకు ముందు రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. ఈ ఏడాది మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ జులై మొదటి వారంలో మూడు, నాలుగు రోజులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు.
ఈ జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షం
అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు కొంత నిరాశ చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు ఐదు రోజులు భారీ వర్షాలు..
ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వివరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
సాయంత్రం 4:40 నుంచి రాత్రి 7:40వరకు..
తెలంగాణ వెదర్ మ్యాన్ భాగ్యనగర వాసులను అలర్ట్ చేశారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు. సాయంత్రం 4:40 నుంచి రాత్రి 7:40 వరకు భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఆయన చెప్పారు.
ALSO READ: Gandikota Murder: వీడిన గండికోట మర్డర్ మిస్టరీ.. హత్య చేసింది వాళ్లే, అరే.. మీరు మనుషులేనా?