Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పర్యాటక సమాచారాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సాంకేతికతను వినియోగించి సందర్శకుల అనుభవాలను మెరుగుపరిచేలా కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది.
కొత్త వెబ్‌సైట్ ప్రారంభం
తెలంగాణ టూరిజం రీడిజైన్ చేసిన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ఆకర్షణలు, అనుభూతులు, పర్యాటకానికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదిక ద్వారా సందర్శకులు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు.
హోమ్‌స్టే నమోదు ఆన్‌లైన్‌లో..
హోమ్‌స్టే నిర్వాహకులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించారు. దీంతో హోమ్‌స్టేల నమోదుకు మరింత సులభమైన, అందుబాటులో ఉండే ప్రక్రియను కల్పించినట్లయింది.
పర్యాటక ప్రచార ట్రైలర్
తెలంగాణలోని వారసత్వం, సంస్కృతి, ప్రకృతి, వంటకాలు, ప్రత్యేక పర్యాటక అనుభవాలను ప్రతిబింబించే కొత్త తెలంగాణ టూరిజం ప్రమోషనల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
360 డిగ్రీలతో గైడ్‌లకు శిక్షణ
పర్యాటక గైడ్‌ల జ్ఞానం, నైపుణ్యాలు, డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు 360 డిగ్రీల సాంకేతికతతో గైడ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంకేతిక ఆధారిత అభ్యాసంతో గైడ్‌లకు నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి ఇది ఉపయోగపడనుంది.
‘మై తెలంగాణ.. మై డెస్టినేషన్’
తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించి, తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునేలా ‘మై తెలంగాణ.. మై డెస్టినేషన్’ డిజిటల్ మీడియా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వీడియోలు, పోస్టర్ క్రియేటివ్‌లను విడుదల చేశారు.
తెలంగాణ పర్యాటకంపై కాఫీ టేబుల్ బుక్
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసే కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. తెలంగాణ వారసత్వం, ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి, పర్యాటక అనుభవాలను ఇందులో చిత్రాలు, సమాచారంతో పొందుపరిచారు.
వీఆర్‌తో పర్యాటక అనుభూతి
తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, పర్యాటక ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ప్రత్యేక తెలంగాణ టూరిజం పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇందులో వర్చువల్ రియాలిటీ (వీఆర్) అనుభవాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా సందర్శకులు తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ఇంటరాక్టివ్‌గా అనుభవించే అవకాశం కల్పించారు.
పర్యాటక రంగంపై చర్చలు
‘ఏఐ, డిజిటల్ టెక్నాలజీ–పర్యాటక భవిష్యత్’, ‘పర్యాటకంలో కొత్త ధోరణులు–ఎకో టూరిజం, సినిమా, క్రీడలు, వారసత్వం’ అంశాలపై రెండు ప్యానెల్ చర్చలు నిర్వహించారు. పర్యాటక, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు ఇందులో పాల్గొన్నారు.
జిల్లాల పర్యాటకానికి ప్రత్యేక ప్రదర్శనలు
తెలంగాణలోని పూర్వ జిల్లాల పర్యాటక ప్రాంతాలు, ఆకర్షణలు, అవకాశాలను పరిచయం చేస్తూ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. హెరిటేజ్ తెలంగాణ శాఖ శిల్పాలను, రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ కళాకృతులు, చిత్రాలను ప్రదర్శించారు. నిథమ్ ఆధ్వర్యంలో పర్యాటక, ఆతిథ్య రంగ విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిచయం చేసే స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
భద్రగిరి మార్ట్‌కు గుర్తింపు
పర్యాటక రంగంలో విశిష్ట సేవలకు ఎక్సలెన్స్ అవార్డులను అందించారు. పర్యాటక ప్రోత్సాహానికి కృషి చేసిన మెదక్, ములుగు జిల్లాల కలెక్టర్లను సత్కరించారు. భద్రాచలంలో గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘భద్రగిరి మార్ట్’ను అభివృద్ధి చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కూడా సత్కరించారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాలు తెలంగాణ పర్యాటక రంగంలో డిజిటల్ పరివర్తన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సందర్శకుల అనుభవాల మెరుగుదలకు దోహదపడేలా రూపొందించారు.
Also Read: సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!