ULC Land Issues: స్వేచ్ఛ బ్యూరో: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.గత ప్రభుత్వం 2016లోనే యూఎల్ సీ కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని మంత్రి తెలిపారు. ఫలితంగా ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా సహచర క్యాబినెట్ మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
యూఎల్ సీ పెండింగ్ దరఖాస్తులపై తాజా నిర్ణయం..
తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నెంబరు.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ యూఎల్ సీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా జీవో జారీ చేశామన్నారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ నెల 16న శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్షన్ 22Aతో ముడిపడి ఉన్న 10–12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారని మంత్రి గుర్తు చేశారు. ఆయన ఆదేశాలనకనుగుణంగా రెవెన్యూ శాఖ ముందుకు సాగుతుందన్నారు.
Also Read: కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్