Voter Revision: తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్ వచ్చింది. ఎందుకంటే గురువారం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇలాంటి భారీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, నకిలీ, డూప్లికేట్ ఓట్లను తొలగించడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఈ ఒక్కటి చేయకుంటే మీ ఓటు గల్లంతే..
ఓటర్లు నింపిన ఫామ్ తిరిగి వస్తేనే ఓటర్ జాబితాలో పేరు ఉంటుంది.. లేదంటే ఇక మిస్ అయినట్టే.. ఇది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూటిగా సుత్తి లేకుండా చెప్పిన విషయం. మీకు ఓటర్ ఐడీ ఉంది.. గత ఎన్నికల్లో ఓటు వేశాం.. మాకేమవుతుంది అని అస్సలు లైట్ తీసుకోకండి. ప్రతి ఒక్కరికి ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుంది.. దానిని ఫిల్ చేయాల్సిందే.. తిరిగి అధికారులకు ఇవ్వాల్సిందే. లేదంటే మీ ఓటు గల్లంతే. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఫామ్ రాకపోయినా.. మిస్ అయినా.. ఆన్‌లైన్‌లో నింపే వెసులుబాటు ఇచ్చింది ఎన్నికల కమిషన్.
అధికారుల సూచన
SIR అనేది ప్రతి ఏటా జరిగేది కాదు. ప్రస్తుతం 24 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ల వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఆ టైమ్‌లో ఓటు హక్కు లేని వాళ్లు.. కొత్తగా తీసుకున్నవాళ్లు.. ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ మెమో ఇలా ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేవీ కూడా అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూపిస్తే సరిపోతుంది. అయితే ఫామ్‌పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించడం మాత్రం తప్పనిసరి.
Also Read: పెళ్లిళ్ల సీజన్ ఆఫర్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!
ఎన్నికల అధికారులకు టాస్క్
ఈ ప్రక్రియ మనకు మాత్రమే కాదు.. ఎన్నికల అధికారులకు కూడా ఒక టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి BLO తన పరిధిలోని దాదాపు 1000 మంది ఓటర్లను కవర్ చేస్తూ, ఈ నెల రోజుల్లో అంటే జూన్ 25 నుంచి జూలై 24 మధ్య ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శిస్తారు. ముందే ప్రింట్ చేసిన ఎన్యుమరేషన్ ఫామ్‌లను ఓటర్లకు అందించి, వాటిని నింపడంలో సహాయం చేసి, తిరిగి సేకరించడం వారి బాధ్యత.
క్షేత్రస్థాయిలో అధికారుల పని
అర్హులెవ్వరూ ఎన్నికల జాబితా నుంచి తొలగించకూడదు.. ఎట్ ది సేమ్ టైమ్ అర్హత లేని వారి పేర్లు లిస్ట్‌లో చేరకూడదు.. ఇదే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ పని చేయకనుంది. కానీ ఒక విషయం మాత్రం ప్రజలు బాగా గుర్తుంచుకోవాలి. ఫామ్‌ను నింపి ఇచ్చిన వారి పేర్లే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయి. SIR ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాసే 35 వేల 985 మంది బూత్ లెవల్ అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పని చేయనున్నారు. ఇన్‌కేస్ మనం ఏదైనా తప్పుడు వివరాలు నమోదు చేస్తే అధికారులు నోటీసులు జారీ చేస్తారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
ఓట్లను మళ్లీ రీ వెరిఫై
ఓ వైపు ప్రక్రియ కాబోతున్న సమయంలో ఓ కొత్త ప్రచారం మొదలైంది. తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు జరుగబోతుందని.. హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ఓ కారణం ఉంది. డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయినవారి పేర్లు.. ఇళ్లు మారిన వారి రికార్డులు.. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడీ ప్రక్రియలో ఇవన్నీ ప్రక్షాళన కానున్నాయి. అయితే ప్రీ మ్యాపిగ్‌లో 89 లక్షల ఓటర్ల రికార్డుల్లో కొన్ని తప్పులు ఉన్నట్టు గుర్తించారు. అందుకే ఈ ప్రచారం జరుగుతోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప్రీ మ్యాపింగ్‌లో కేవలం 46.65 శాతం మాత్రమే మ్యాచ్ అయ్యాయి. అంటే అంటే 47.36 లక్షల మంది ఓటర్లలో 22.09 లక్షల ఓట్లు మాత్రమే మ్యాచ్ అయ్యాయి. సో.. ఇప్పుడీ ఓట్లను మళ్లీ రీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
SIRపై స్పెషల్ ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం కూడా SIRపై స్పెషల్ ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే కాస్త కోపంగానే ఉన్నారని చెప్పాలి. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉండటంతో.. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సీఎం రేవంత్. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతల అప్రమత్తం
అటు బీఆర్ఎస్ కూడా పార్టీ నేతలను అప్రమత్తం చేసింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు.. నిరక్ష్యరాస్యులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ తరపున బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. బీఆర్‌ఎస్ మాత్రమే కాదు.. అన్ని రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవల్ ఏజెంట్లను నియమిస్తున్నాయి. మొత్తానికైతే తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు కాస్త అలర్ట్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది. మాకేందుకులే అనుకోకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటే మాత్రం ఈ ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే.