TFJA : తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటన
భారతీయ చలన చిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ఓ సువర్ణాధ్యాయం . నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యక్తి నుంచి వ్యవస్థగా మారిన బంగారు మనిషి కృష్ణ . మహా నటుడు ఎన్టీఆర్, ఏన్నార్ అడుగుజాడల్లో నడుస్తూ, శోభన్ బాబుతో కలిసి తెలుగు సినిమా రంగానికి నాలుగో స్తంభంగా నిలిచారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా అన్ని రంగాలపైనా పట్టు సంపాదించి తెలుగుతోపాటు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో చిత్రాలు నిర్మించారు.
300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం.ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనం కృష్ణ. ఆయన మరణం కోట్లాది మంది అభిమానులను దుఃఖ సాగరంలో ముంచింది. సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు పూడ్చలేనిదని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పేర్కొంది.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల తరుపున అధ్యక్ష, కార్యదర్శులు వి. లక్ష్మీనారాయణ, వై. జె. రాంబాబు..కృష్ణ మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ఒకే ఏడాది సోదరుడిని, తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ బాబుకు, ఘట్టమనేని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రార్థిస్తోంది.