TG Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలంటే చాలు.. బీఆర్ఎస్ కు ఏం చేయాలో తోచని పరిస్థితి ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎలాగోలా మీడియాలో కనిపించాలి, ఆ తర్వాత అసెంబ్లీకి డుమ్మా కొట్టాలి. ఇదేనా బీఆర్ఎస్ నైజం అంటున్నారు నెటిజన్స్. ప్రశ్నించేందుకు సబ్జెక్ట్ లేకనో ఏమో కానీ, పాత చింతకాయ పచ్చడి విషయాలతో బీఆర్ఎస్ రావడం, కాంగ్రెస్ తిప్పికొట్టడం ఇదే పనిగా మారింది.
మొన్నటికి మొన్న అసెంబ్లీ తొలి సమావేశం రోజు, టీషర్ట్స్ పై అదానీ, సీఎం రేవంత్ రెడ్డి బొమ్మతో వచ్చిన బీఆర్ఎస్ నేతలు పోలీసులు అనుమతించక పోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే నేటి సమావేశాల్లో కూడా రైతుకు సంకెళ్ల పేరిట ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి వాకౌట్ చేసి పలాయనం చిత్తగించారు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు.
తొలి అసెంబ్లీ రోజు అదానీకి సీఎం రేవంత్ రెడ్డికి అనుబంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ఊదరగొట్టారు. అది కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి అదానీ రూ. 100 కోట్ల నిధులను విరాళంగా ఇచ్చిన సమయంలో తీసిన ఫోటోతో. అప్పుడే నెటిజన్స్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆ 100 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి వద్దన్న విషయాన్ని కూడా మరచి, బీఆర్ఎస్ విషప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ లీడర్స్ కూడా తిప్పికొట్టారు.
నేడు మాత్రం ఏకంగా లగచర్ల రైతుకు సంకెళ్లు అంటూ.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. మొన్నటికి మొన్న రైతుకు సంకెళ్లు వేసిన ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆరోగ్యం బాగా లేకున్నా, సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటూ సీఎంఓ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది.
Also Read: Jamili Elections: జమిలీ కోసం.. కమిలి పోతున్న పార్టీలు.. ఆశలు గల్లంతేనా?
కానీ ఇవేమి పట్టని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు సబ్జెక్ట్ లేకనో ఏమో కానీ, ఏ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్న కుదరని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలు, మరోవైపు రాష్ట్రఅభివృద్దికి ప్రభుత్వం పాటుపడుతుంటే, బీఆర్ఎస్ నోట మాటలు లేవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నందుకు ఏదోకటి అడగాలిగా.. అందుకే పాపం బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు తిప్పలు తప్పలేదని నెటిజన్స్ అంటున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు కాస్త ఆలోచించి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.