Jamili Elections: ఇటీవల ఏ పార్టీ నాయకుడి నోట విన్నా, జమిలీ ఎన్నికల మాటే. జమిలీ వస్తే చాలు, అధికారం చేజిక్కించుకోవాలన్నది అసలు ప్లాన్. కేంద్రం కూడా అదిగో జమిలీ, ఇదిగో జమిలీ అంటూ దోబూచులాడుతోంది. జమిలీ ఎన్నికలు వచ్చాయంటే చాలు, దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడిప్పుడే ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమిని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే.
తెలంగాణలో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలు రావాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. జమిలీ ఎన్నికలు వస్తే చాలు, తమకు అధికారం ఖాయమని బీఆర్ఎస్ అంచనా. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మాత్రం ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. మొన్ననే ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సరికొత్త పథకాలతో దూసుకుపోతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా కాంగ్రెస్ రోజురోజుకూ బలంగా తయారవుతున్న పరిస్థితిలో ఎన్నికలు వస్తే, పథకాలకు బ్రేక్ పడొచ్చని కూడా ఇక్కడి పలు పార్టీల ఆలోచనగా చెప్పవచ్చు. అందుకే ఇక్కడ జమిలీ ఎన్నికలు రావాలని అధికారం కోల్పోయిన పార్టీలు ఎదురు చూస్తున్నాయి.
ఇక ఏపీలో సంగతి అయితే వైసీపీ వేయి కళ్లతో జమిలీ ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ గత ఎన్నికల్లో భారీ ఓటమిని చవి చూసింది. ఇది ఏమాత్రం వైసీపీ క్యాడర్ కు రుచించని పరిస్థితి. అందుకే మాజీ సీఎం జగన్ కూడా జమిలీపైనే ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన ఇప్పుడే పూర్తి చేసుకుంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలు వస్తే, మళ్లీ అధికారంలోకి రావచ్చన్నది వైసీపీ అభిప్రాయం.
అయితే కేంద్రం మాత్రం జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి దోబూచులాడుతుంది. జమిలీ ఎన్నిక నిర్వహణకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది. మొన్నటి వరకు బిల్లు ఊసే లేదని వార్తలు గుప్పుమన్నాయి. అప్పుడు పలు పార్టీలు డీలా పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచించిందట. రేపో, మాపో బిల్లు ప్రవేశపెడితే 2027 లో ఎన్నికలు రావచ్చని అంచనా. ఏదిఏమైనా జమిలీ ఎన్నికలపై ఎప్పటికప్పుడు పార్టీలు విషయాలను తెలుసుకొనేందుకు పార్టీలు తెగ ఆరాటపడుతున్నాయట.