Organic Farming: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ పొందిన రైతులు తమ ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి మార్కెటింగ్ సౌకర్యాలను అందించడంలో భాగంగా ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ ను ప్రభుత్వం అందుబాటులో తీసుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు నేరుగా ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులను సంప్రదించి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇది సేంద్రీయ వ్యవసాయంలో ముందడుగుగా నిలువబోతుంది.
యాజమాన్య పద్దతులు పాటిస్తూ, ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు, జన్యుమార్పిడి పంటలను వాడకుండా, సహజ వనరుల నుండి పోషకాలను, సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయు విధానమే సేంద్రీయ వ్యవసాయం. నేటి ఆధునిక వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాదించాలి అనే లక్ష్యంగా, విచ్చల విడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వలన, రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆశించిన దిగుబడులు సాదించలేకపోవటమే కాకుండా, వాటి అవశేషాలు మనం తినే ఆహారంలోను, చుట్టూ ఉన్న వనరులలో పేరుకుపోయి వాతావరణానికి కూడా తీరని నష్టాల్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు అడుగులు వేస్తుంది. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక వ్యవసాయ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 4 న వికారాబాద్ జిల్లా, తాండూర్ లో టీజీ ఆర్గానిక్స్ మొబైల్ యాప్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించనున్నారు.
Also read: PSL 2026: మ్యాచ్ జరుగుతుండగా గొడవ.. తన్నుకున్నచాప్మన్, మహమ్మద్ అలీ
ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగా ఎలాంటి రసాయనాల అవశేషాలు లేని సేంద్రియ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఇతర మార్కెట్ లో ఎక్కువ ధరలకు సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఆసక్తితో సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నపట్టికి వారు పండించిన సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ లో సరైన నాణ్యతా గుర్తింపు విధానం లేకపోవటం వలన, వినియోగదారుడికి రైతు పండించిన సేంద్రీయ ఉత్పత్తులపైన సరైన నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని, దళారులు మార్కెట్ లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలు ఉన్నాయి.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఆర్గానిక్ ఆహారానికి ఎక్కువ డిమాండ్ పెరగడం, తద్వారా సేంద్రియ ఉత్పత్తులకు సాధారణ పంటలకంటే ఎక్కువ ధర లభించడం వలన ఎంతో మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలలో సేంద్రియ సాగుచేస్తున్నారు. మంచి మార్కెట్ సదుపాయాలు ఉండటంతో హైదరాబాద్ చూట్టు పక్కల సేంద్రీయ పంటల సాగు పెద్దమొత్తంలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం క్రింద 60 వేల ఎకరాలలో సేంద్రియ సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే మార్కెట్ లో సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోలు, వాటి నాణ్యతా విషయంలో సరైన ప్రమాణాలు,పద్దతి ప్రకారం ప్రజలకు నమ్మకం కలిగేలా సేంద్రీయ ఉత్పత్తులను దృవీకరించి వినియోదారులకు అందుబాటులో ఉంచాలని, భారత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్దేశించిన ఎన్పీఓపీ ప్రమాణాల ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ సంస్థలకు సేంద్రీయ దృవీకరణ చేసేందుకు గుర్తింపు అనుమతులు ఇచ్చింది.
రాష్ట్రంలో జనవరి 2026 నాటికి, సుమారు 10 వేల మంది సేంద్రీయ రైతులు, 50 వేల ఎకరాలలో, 206 ఆపరేటర్లు, 24 ఆర్గానిక్ ఫార్మార్స్ గ్రూపుల కింద సేంద్రీయ ధృవీకరణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల ప్రకారం 61,125 ఎకరాలలో, 489 క్లస్టర్లలో ప్రకృతి వ్యవసాయ దృవీకరణ కూడా చేయుటకు రైతు పంట క్షేత్రాల నమోదును కూడా 2026 లో ప్రారంభించారు. తృణ ధాన్య పంటలు (వరి, జొన్న, మొక్కజొన్న మరియు చిరు ధాన్యాలు) పప్పు దినుసులు (కంది, పెసర, మినుము, శనగ మరియు సోయాచిక్కుడు), నూనె గింజలు (వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు), కూరగాయలు (టమాటా, వంకాయ, మిరప, కూకుంబర్, క్యారెట్, సొరకాయ, కాకర, బూడిద గుమ్మడి, బీరకాయ, బీన్స్, బెండకాయ, గోరుచిక్కుడు, ఉల్లిగడ్డ అన్నీ రకాల ఆకుకూరలు), పండ్లు (మామిడి, సపోటా, జామా,పుచ్చకాయ, కర్బూజా, నిమ్మ, ఆరట, ధానిమ్మ, ఫిగ్గ్, మొసాంబి), వ్యాపార మరియు ఔషధ పంటలు, (చెరుకు, పసుపు, ఆలోవీర, మునగ, ప్రత్తి) మొదలగు పంటలకు సేంద్రీయ దృవీకరణ చేయనున్నారు.సేంద్రీయ దృవీకరణ తో వినియోగదారులకు నమ్మకం,భరోసా, సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ ,మార్కెట్లో అవకతవకల నియంత్రణ ,వాణిజ్య సరిళలో సేంద్రియ ఉత్పత్తులకు ప్రోత్సాహం ,ధృవీకరణ అనేది పారదర్శకతకు ఒక పటిష్టమైన మార్కెటింగ్ సాధనం. రాష్ట్రంలో సేంద్రీయ దృవీకరణ పద్దతి, టీజీ ఆర్గానిక్స్ మొబైల్ ద్వారా మార్కెట్ లో ఇబ్బడిముబ్బడిగా నకిలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నియంత్రించే అవకాశంఉంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి, తగిన చర్యలు కూడా తీసుకుంటుంది.
Also read: ఆలయాలకే రక్షణ కరువైందా? అల్లూరి జిల్లాలోని పాడేరు దుర్గాదేవి ఆలయంలో భారీ చోరీ
కస్టమర్లు ఎవరైనా ప్లే స్టోర్ నుంచి టీజీ ఆర్గానిక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత, ఓటీపీతో లాగ్ ఇన్ అవ్వాలి. మొదటగా తమకు కావలసిన పంటల గ్రూపును, పంట ఉత్పత్తులను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత వచ్చే రైతుల వివరాల ద్వారా నేరుగా వారిని సంప్రదించి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో తమకు 50 కిలోమీటర్ల పరిదిలో ఉండే రైతుల వివరాలు మొదటగా వస్తాయి, ఒకవేళ పరిధిని తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవచ్చు
=ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు యాప్ లో ఉన్నారు.
=తెలంగాణలో సేంద్రీయ దృవీకరణ సేవలు ఇస్తున్న ఇతర రీజినల్ కౌన్సిల్స్ అయిన ఏకలవ్య ఫౌండేషన్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ తో ఇతర ఆర్సీ లకు చెందిన ఆర్గానిక్ రైతుల వివారాలు కూడా ఈ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది.
=సుమారు 100 కు పైగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ యాప్ లో కస్టమర్లకు అందుబాటులో ఉంచడం జరిగింది
=రైతు మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు
=రైతు వద్ద అందుబాటులో ఉన్న దృవీకృంచిన వివిధ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
=తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ సర్టికెట్లు పొందిన రైతుల వివరాలు మాత్రమే యాప్ లో ఉంటాయి
=చివరగా ఈ యాప్ ద్వారా కేవలం ఆర్గానిక్ రైతు వివరాలు, అతని వద్ద అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ వివరాలు మాత్రం ఈ యాప్ లో ఉంచారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క రేటు ను నిర్ణయించే అధికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.
Also read: విద్యార్థులకు ఎన్డీఏ బిగ్ అలర్ట్.. రేపే పరీక్ష.. జామర్లు సీసీ కెమెరాల ముందే పరీక్ష..!