Theft in mortuary : కొన్ని ఘటనలు మానవత్వానికే మచ్చ తెస్తుంటాయి. వీళ్లు మనుషులేనా.? అనేలా చేస్తుంటాయి. అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. సాటి మనిషి చనిపోయిందన్న కనీస కనికరం లేని కొందరు.. శవం దగ్గర సైతం దొంగతానికి పాల్పడ్డారు. అదేమంటే.. మాకేం తెలుసంటూ దబాయించారు. దాంతో.. కూతురు చనిపోయిందని బాధపడాలో, ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామని భయపడాలో తెలియని స్థితిలో.. లబోదిబోమంటున్నారు.. బాధిత కుటుంబసభ్యులు.
గద్వాల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో గురువారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో మెరిస్సా అనే మహిళ మృతి తీవ్రంగా గాయపడి మరణించింది. దాంతో.. ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. నివ్వెరపోయే విషయాన్ని గమనించారు. ప్రయాణ సమయంలో ఆమె ధరించిన బంగారం, మార్చురీకి తీసుకువచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది.
దాంతో అవ్వాకైన మహిళ కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ సిబ్బందిని అడిగారు. సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్న మార్చురీ సిబ్బంది.. మీరే తీసారేమోనంటూ దబాయించారు. ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు అడిగినా.. సమాధానమివ్వలేదని మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు వాపోయారు. అసలే మా కూతురు చనిపోయిందన్న దుఃఖంలో ఉన్న తమకు.. మృతదేహంపై ఉన్న బంగారు దొంగిలించడం మరింత బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవ విలువలు లేకుండా ఇలా చేయడం.. ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : 16 ఏళ్ల స్టూడెంట్‌ని కిడ్నాప్ చేసిన మహిళా టీచర్.. లింగమార్పిడి చేసుకొని పెళ్లికోసం..
పోస్టుమార్టం సమయంలోనూ మృతదేహంపై బంగారం ఉన్నట్లు వివరాలు అందించామని చెబుతున్న బాధిత కుటుంబ సభ్యులు.. సుమారు తులం బంగారు అపహరించారి వాపోతున్నారు. సంబంధిత మార్చురీ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.