Thummala Nageshwar Rao: స్వేచ్ఛ బ్యూరో: ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్రం ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. సచివాలయంలో గురువారం వ్యవసాయాధికారులతో సమీక్షించారు.
తుమ్మల మాట్లాడుతూ..
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతును ఆయిల్ పామ్ సాగు చేయమని ప్రోత్సహిస్తారు.. కానీ రైతు పండించిన గెలలకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులను మాత్రం కేంద్రం దెబ్బతీస్తోంది. ఒక చేత్తో రైతును ఆయిల్ పామ్ వైపు నడిపిస్తూ.. మరో చేత్తో దిగుమతి సుంకం తగ్గించి విదేశీ పామాయిల్‌కు మార్కెట్‌ను సులభతరం చేయడం ఏ విధమైన రైతు అనుకూల విధానం?’ అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో క్రూడ్ పామ్ ఆయిల్‌పై మొత్తం దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గిందని, దీంతో దిగుమతి చేసుకునే పామాయిల్‌కు పోటీ ప్రయోజనం పెరిగి, దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
కేంద్రంపై తుమ్మల సీరియస్
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి దిగుమతి సుంకాన్ని పెంచాలని కోరుతున్న సమయంలో కేంద్రం సుంకాన్ని తగ్గించడం బాధ్యతారాహిత్యమైన నిర్ణయం అన్నారు. రైతులకు ధర భరోసా కల్పించాల్సిన సమయంలో విదేశీ దిగుమతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేంద్రం ఎవరికి ప్రయోజనం కల్పించాలనుకుంటోంది? అని నిలదీశారు.
టన్నుకు రూ.25 వేలు ఇవ్వాల్సిందే..
ఆయిల్ పామ్ అనేది సాధారణంగా ఒక సీజన్‌లో పండించి విక్రయించే పంట కాదని, రైతు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి, నీరు, ఎరువులు, నిర్వహణ ఖర్చులు భరిస్తూ సాగు చేసే దీర్ఘకాలిక పంట అని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పంటకు మార్కెట్ ధరపై విధానపరమైన స్థిరత్వం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకుపైగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు ధర భరోసా కల్పించేలా కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, లేని పక్షంలోఎఫ్ఎఫ్బీలకు టన్నుకు రూ.25,000 కనీస హామీ ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రా న్ని డిమాండ్ చేశారు.
Also Read: 1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?