Mahesh Kumar on KCR: బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కారు దుకాణం బంద్ అయ్యిందన్నారు. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్ -4 వద్ద టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారు పార్టీకి అభ్యర్థులు దొరకలేదన్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలుంటే బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని చెప్పుకొచ్చారు.
మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం బీజేపీకి ఆనవాయితీగా వస్తుందన్నారు టీపీసీసీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో మొట్ట మొదటిగా తెలంగాణలో కుల గణన సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. కుల గణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందన్నారు. కేటీఆర్-కవిత-హరీష్ మధ్య గేమ్ మొదలైందన్నారు. బీసీల గురించి ఆయా నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం రీసర్వే జరపమని అడిగే అర్హత లేదన్నారు.
ALSO READ: కేటీఆర్ కొత్త ప్లాన్.. అలాగైతే మేం రెడీ, మీ శకం ముగిసిందన్న అధికార పార్టీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెర వేరుస్తున్నట్లు చెప్పకొచ్చారు. సీఎం రేవంత్, మంత్రుల చొరవతో రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు.
ఫాం హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకని సూటిగా ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాం హౌస్ లో సేద తీరుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.