Prashant Kishore: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త పీకే తన కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు జన్ సురాజ్ పార్టీగా తన పార్టీ పేరుగా ప్రకటించేశారు. ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇవాళే దీనికి ఆమోదం తెలిపిందని, పాట్నాలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
బిహార్ రాజధాని పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. గత రెండు మూడేళ్లుగా జన్ సురాజ్ పేరిట ప్రచారం సాగిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అధికారికంగా పార్టీని ఎప్పుడు తెస్తారని ఇన్నాళ్లు జనం అడుగుతూ వచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ కళ నేటితో సాకారమైనట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు దైవానికి కృతజ్ఞతలు చెప్తున్నట్లు తెలిపారు.
మందుపై ఉన్న బ్యాన్ ఎత్తేస్తాం
ఇక మళ్లీ పొలిటికల్ కన్సెల్టెన్సీల వైపు వెళ్లేది లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే బీహార్‌లో మద్యాన్ని నిషేధిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇక బీహార్‌ను విద్యా వ్యవస్థలో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే పదేళ్లలో దాదాపుగా రూ.5 లక్షల కోట్లు అవసరం అవుతాయన్నారు.
ఇక లిక్కర్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చే ధనాన్ని కొత్త విద్యా వ్యవస్థను నిర్మించేందుకే వాడతామన్నారు. లిక్కర్ నిషేధంతో ఏటా 20 వేల కోట్ల రూపాయల మేర రాష్ట్రం నష్టపోతోందని చెప్పుకొచ్చారు.
also read : అయ్యో… రాహుల్ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?
జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో పలువురు నేతలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్ సహా ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి లలన్ యాదవ్ చేరిపోయారు. ఇక ఓబీసీ తరఫున మరో విశ్రాంత ఐఆర్‌టీఎస్ అధికారి మహేంద్ర మెహతా జాయిన్ అయిపోయారు. ఎమ్మెల్సీ అఫీఖ్ అహ్మద్, మాళవికా రాజ్ లాంటి బడా నేతలు పీకే గూటికి చేరారు.