Mahesh Kumar Goud: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. చూపరులను ఆహ్లాద పరిచేలాంటి వాతావరణం సైతం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహావిష్కరణతో పాటు, ప్రజాపాలనా విజయోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు.. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.
ఈనెల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా.. మండల, నియోజక కేంద్రంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల పండగ జరుపుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి పక్ష నేత కేసీఆర్ ప్రజా పండుగకు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆయన కోరారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని ఉద్యోగాలు.. ఏడాది లోనే 50 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అన్ని రంగాలలో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తుందని ఆయన తెలిపారు. అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని తీసివేస్తాం అని కేసీఆర్ అంటుండు.. మీరు తెలంగాణ తల్లి విగ్రహం దొరలు, దొరసానులను తలపించే విధంగా ఉందని విమర్శలు గుప్పించారు.
Also Read: త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాము పెట్టే విగ్రహం తెలంగాణ సంసృతులను ప్రతిబింబిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు ఏమి త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అని.. దేశాన్ని దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడ నిర్బంధం చేయలేదన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాష సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు చౌకబారు మాటలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పది ఏండ్లుగా మీరు లూటీలు, దోపిడీ చేశారు కాబట్టే హరీష్ రావు మీద కేసులు బుక్ అవుతున్నాయని విమర్శలు గుప్పించారు. తండ్రి కొడుకులు తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు మిగలరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి 35 ఏండ్లలో తెలంగాణ కోసం చేసింది ఏమిటి అని ప్రశ్నల వర్షం కురిపించారు.