Hyderabad city: వినాయక చవితి వచ్చిందంటేచాలు హైదరాబాద్‌లో సందడి అంతా ఇంతా కాదు. భక్తుల చూపంతా భాగ్యనగరంపై ఉంటుంది. ఖైరతాబాద్ గణేషుడి గురించి చెప్పనక్కర్లేదు. ఆ వినాయకుడ్ని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధికంగా తరలివస్తుంటారు. మూడో రోజు నుంచి సిటీలో నిమజ్జనాల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.
గణేష్ విగ్రహ ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5 వరకు కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మధ్యాహ్నం 3 గంటల నుండి అర్థరాత్రి వరకు పివిఎన్ఆర్ మార్గ్‌లోని ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వైపు ట్రాఫిక్ మళ్లింపును ప్రకటించారు.
వాటిలో సెయిలింగ్ క్లబ్ జంక్షన్, వీవీ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్, నల్లగుట్ట వంతెన, బుద్ధ భవన్ వంటి ముఖ్యమైన మళ్లింపు పాయింట్లు ఉన్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లకు వెళ్లే మార్గాలు రద్దీ స్థాయిలను బట్టి నియంత్రించబడతాయి. లేకుంటే మూసివేయబడతాయని పోలీసులు తెలిపారు.
లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనదారులు కవాడిగూడ, బేగంపేట, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ప్రయాణ సహాయం లేకుంటే అత్యవసర పరిస్థితుల కోసం భక్తులు లేదా ప్రయాణికులు 9010203626 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
ALSO READ: పక్క పార్టీ నేతలపై ఫోకస్.. బీఆర్ఎస్ ముందస్తు వ్యూహం
ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు అధికారులు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు భక్తులు ఉపయోగించాలని కోరారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల వైపు వెళ్ళాలన్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని ప్రకటించారు.
వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. రేస్‌కోర్స్ రోడ్, ఎన్‌టిఆర్ ఘాట్, ఐమాక్స్ లాట్స్, విశ్వేశ్వరయ్య భవన్ వంటి ప్రాంతాలున్నాయి. గణేషుడు నిమజ్జన కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.
అందుకోసం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చెరువునలను ఏర్పాటు చేసింది. అందులో 28 పోర్టబుల్ చెరువులు, 21 ప్రత్యేక చెరువులు, 29 చిన్నపాటి చెరువులున్నాయి. వివిధ ప్రాంతాల వారు సమీపంలో ఏర్పాటు చేసిన చెరువుల్లో వినాయకుడ్ని నిమజ్జనం చేయాలనేది క్లియర్‌గా వివరించారు జీహెచ్ఎంసీ అధికారులు.