Bandi Sanjay on KTR: ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌పై మండిపడ్డారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఆయన మాట్లాడే భాష సరిగా లేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని అవినీతిమయంగా వర్ణించారు. కేటీఆర్ అరెస్టయితే ఎందుకు ఆందోళన చేయాలని ప్రశ్నించారు.
శుక్రవారం కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై కేటీఆర్ జైలుకు పోతే ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. అయనేమైనా దేశం కోసం ఏమైనా పోరాటం చేశారా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ రేసు వల్ల రూ. 700 కోట్ల లాభాలు వచ్చాయని చెప్పిన కేటీఆర్, ఆ నిధులు ఎక్కడున్నాయో చూపాలన్నారు. వాటిపైనా కేటీఆర్ ఫ్లాన్ చేసినట్టు కనిపిస్తోందన్నారు.
అయినా కేబినెట్ అమోదం లేకుండా డబ్బులు ఎలా చెల్లిస్తారు? కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెట్టడమో బీజేపీ లక్ష్యమన్నారు. రైతులకు రుణమాఫీ, పంట నష్టపరిహారం ఇవ్వడానికి లేని జోరు, ఫార్ములా రేసుకి ఎందుకొచ్చిందన్నారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ చేసేది లొట్ట పీసు కేసని తనదైన శైలిలో చమత్కరించారు. డ్రగ్స్ కేసుల మీద కేసీఆర్ కుటుంబాన్ని ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు.
కరీంనగర్ రైల్వే పనులను సకాలంలో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. అమృత్ భారత్ స్కీం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలతో రైల్వే పనులను చేపడుతున్నారని గుర్తు చేశారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే మార్చిలోపు కరీంనగర్ రైల్వే స్టేషనుని ప్రారంభించేలా చూస్తామన్నారు. రూ. 95 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషను పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో మార్పు.. పూర్తి వివరాలివే!
సకల సౌకర్యాలతో మోడల్ రైల్వే స్టేషనుగా రూపుదిద్దుతామన్నారు. సేతు బంధు స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆర్వోబీ పనులు చేస్తున్నామన్నారు. దీనికి కేంద్రం 100 శాతం నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు రాష్ట్ర నుంచి సహకారం ఉండాలన్నారు. ఈ విషయంలో భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.