Big Stories

Komatireddy : అక్కడ నుంచే పోటీ చేస్తా.. అప్పటి వరకు రాజకీయాలపై మాట్లాడను: కోమటిరెడ్డి

Komatireddy : టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టికేలకు పెదవి విప్పారు. ఎన్నికలకు నెలరోజుల ముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల, గజ్వేల్‌ మాదిరిగానే నల్గొండ నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. నల్గొండలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ కమిటీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. దీనిపై కోమటిరెడ్డి స్పందించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నానని మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దామన్నారు. గతంలో మంత్రి పదవినే వదిలేశానని పార్టీ పదవులు తనకో లెక్కా ? అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చిచెప్పారు.

- Advertisement -

మునుగోడు ఉపఎన్నికలో వ్యవహరించిన తీరుతోనే ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీలో స్థానం దక్కలేదని ప్రచారం సాగుతోంది. పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ బీజేపీ అధ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం పరోక్షంగా పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రెండుసార్లు పార్టీ జాతీయ కమిటీ నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి పూర్తిగా దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా 40 మందితో పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, మాణిక్యం ఠాకూర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News