
Modi Warangal Tour(Political news today telangana): ప్రధాని మోదీ వరంగల్ టూర్ తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మళ్లీ వార్ మొదలైంది. మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చలేదన్నారు.
ప్రధాని మోదీ గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 20 వేల కోట్ల నిధులు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడమేంటని నిలదీశారు. రాష్ట్రంపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, అప్పులు పెరిగిపోయాయని కేటీఆర్ విమర్శించారు.
అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వాటాల సర్కార్ గా మారిందని ఆరోపించారు. వరంగల్ సభలో కల్వకుంట్ల కుటుంబ పాలనపై మోదీ మాట్లాడతారని వెల్లడించారు. కేసీఆర్ ఫ్యామిలీని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. కుటుంబ పార్టీల వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. తెలంగాణలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన రావాలని స్పష్టం చేశారు.
మోదీ టూర్ తో వరంగల్ నగరానికి కొత్త తేజస్సు వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. 30 ఏళ్లుగా వరంగల్‌కు ఏ ప్రధాని రాలేదని గుర్తు చేశారు. ఓరుగల్లును మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.