Farmers Protest: వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను అమ్ముకునేందుకు వారానికి పైగా మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ సెంటర్లలో నిరీక్షిస్తున్నా.. పాలకుల నుంచి స్పందన లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ఇల్లంద అంబెడ్కర్ సెంటర్ వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగిన రైతులు, ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే తడిసిపోతుంటే, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ రంగు పులుముతున్న వడ్ల కొనుగోలు?
ఈ నిరసనలో రైతులు వ్యక్తం చేస్తున్న మరో ప్రధాన ఆరోపణ రాజకీయ వివక్ష. స్థానిక అధికార పార్టీ నాయకులు రైతులను “కాంగ్రెస్ రైతులు, బీఆర్ఎస్ రైతులు, బీజేపీ రైతులు” అంటూ వర్గాలుగా విభజిస్తున్నారని వారు మండిపడుతున్నారు. “రైతుకు కులం ఉండదు, మతం ఉండదు.. కేవలం కష్టం మాత్రమే ఉంటుంది” అని ఆవేదన చెందుతున్న కర్షకులు, పార్టీల పేరుతో కొనుగోళ్లలో జాప్యం చేయడం దారుణమని ధ్వజమెత్తుతున్నారు. కేవలం రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగానే టోకెన్ల జారీ, కాంటాల ప్రక్రియ సాగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలేనా?
జిల్లా కలెక్టర్ గారు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ మాటను కూడా అధికారులు లెక్కచేయకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో అర్థం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వేల క్వింటాళ్ల ధాన్యం కళ్లాల్లోనే మగ్గిపోతోందని, అకాల వర్షాల భయం తమను వెంటాడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అన్నం పెట్టే చేతులు.. అభ్యర్థించే స్థితిలో!
దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతు, తాను పండించిన పంటను కొనుగోలు చేయమని అధికారుల కాళ్లు మొక్కాల్సిన దుస్థితి రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. “మేము పండించింది విషం కాదు.. సమాజానికి ప్రాణం పోసే ఆహారం. దాన్ని అమ్ముకోవడానికి కూడా ఇన్ని కష్టాలా?” అంటూ ఓ వృద్ధ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. అన్నదాత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం పాలకులకు తగదని, ఇప్పటికైనా అధికారుల వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ రహదారిపై బైఠాయింపు.. వెనక్కి తగ్గేదే లేదు!
తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు భీష్మించుక కూర్చున్నారు. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, తక్షణమే కాంటాలు వేయించి రైతులకు భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
Also Read: తమిళ పాలిటిక్స్‌లో ‘రిసార్ట్’ రాజకీయం.. పుదుచ్చేరికి తరలిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు!