Bandi Sanjay : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసు విచారణ ఉన్న సమయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్ పై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గత పర్చకూడదని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఈ నెల 29లోపు కేసు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. హైకోర్టు ధర్మాసనంపై బీజేపీకి నమ్మకం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరో తేలుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులోని దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని అని బండి సంజయ్ స్పష్టం చేశారు.