CM Revanth Reddy: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హుస్నాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రూ. 262.68 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణరావు, శ్రీను, సంజయ్, మేడిపల్లి సత్యం సహా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్‌కు, డిసెంబర్ 3 తేదీకి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేశారు. ‘ప్రజలపై ఆధిపత్యం చెలాయించిన దుర్మార్గ పాలనకు ఈ రోజే చరమగీతం పాడారు. ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఈ రోజే స్థాపించారు. తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసింది కూడా డిసెంబర్ 3నే’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. రాబోయే రోజుల్లో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధమవుతున్నామని తెలిపారు.
గత పాలకుల లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిపోయిందని విమర్శించారు. ఎస్.ఆర్.ఎస్.పి. లాంటి ప్రాజెక్టులు తాము కట్టినవే నేటికీ ప్రజలకు ఫలాలు అందిస్తున్నాయని తెలిపారు. నాటి కాంగ్రెస్ పాలకులు కట్టిన ప్రాజెక్టుల వలనే దేశానికి సేవలు అందిస్తున్నామని, వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనేలా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో లక్ష 4 వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేశామని వివరించారు.
ఉచిత బస్సులో మహిళలు తిరుగుతున్నారని అనుకుంటున్నారు, కానీ వెయ్యి బస్సులకు ఇప్పుడు మహిళలు యజమానులయ్యారు అని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేవారని, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలని.. వారి ఇళ్లలో వెలుగు ఉండాలని 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అనంతగిరి పూర్తి అయ్యాయి కానీ గౌరవెల్లి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా నిధులు ఎందుకు ఇవ్వలేదు, గౌరవెల్లిని ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. గత పాలకుల వలె హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయమని, గౌరవెల్లిని పూర్తి చేస్తామని, ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామని హామీ ఇచ్చారు.
అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్‌లో చేరే ప్రతి విద్యార్థికి 2 వేల స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే, సర్పంచులు, వార్డు సభ్యులు మంచి వాళ్ళు ఉంటే గ్రామాలు బాగుపడతాయని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వంతో, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పని చేసే వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కిరికిరి గాండ్లను ఎన్నుకుంటే ఏళ్లు సుస్తుండగానే గడిచిపోతాయని హెచ్చరించారు. గ్రామాలకు వెలుగు ఇచ్చే ఈ ఎన్నికల్లో మంచి వాళ్ళను ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు.
ALSO READ: Pawan Kalyan: తెలంగాణ ప్రజలను అవమానించిన పవన్ కల్యాణ్‌ను.. కాపాడడమే బీజేపీ లక్ష్యమా..?