Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. ఈ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళణ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం.. గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే అది కూడా ఒక్క రోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ రోజు సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఇంట్రస్ట్‌గా మారింది.
వారం రోజులు అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే గవర్నర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇప్పటికి వరకు ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన అప్పులు.. ఈ ప్రభుత్వం చెల్లిస్తుందా..? వడ్డీ, అసలకు సంబంధించి.. అలానే ఆర్ధిక పరమైన ఇబ్బందుల గురించి కూడా సభలో చర్చించే అవకాశం కనిపిస్తుంది.
Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో చేరిన సోయం బాపూరావు, ఆత్రం సక్కు
వచ్చే సంక్రాంతి తర్వాత రైతులందరికి రైతు భరోసా వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిని కూడా అసెంబ్లీ వేదికగా ప్రజల చేరేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం రైతు సంక్షేమం మీద ఎంత ఖర్చు పెట్టిందో దానికి రెట్టింపు కేవలం ఒకే ఏడాదిలోనే ఖర్చు పెట్టింది. ఇవన్ని కూడా గణాంకాలతో సహా అసెంబ్లీ వేదికగా వివరించే అవకాశం ఉంటుంది. మరో పక్క బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. మరి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.