Notice to Venu Swamy : తెలుగు రాష్ట్రాల్లో జరిగే అనేక విషయాలపై నిత్యం సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జ్యోతిష్యుడు వేణు స్వామికి కాలం కలిసి రావడం లేదనిపిస్తోంది. అనేక అంశాలు, రంగాల్లోని వ్యక్తులపై తరచూ ఏదో ఓ వ్యాఖ్యలు చేసే ఈయనకు.. తన జాతకం మాత్రం అనుకూలించడం లేదని.. ఇటీవలి ఘటనల్ని చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే.. ఓ జర్నలిస్ట్ తో వివాదం కారణంగా.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు వరకు వెళ్లిన వ్యవహారం మరువక ముందే.. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలని తెలంగాణా మహిళా సంఘం సమన్లు జారీ చేసింది. దీంతో వేణు స్వామి వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.
సినీ పరిశ్రమలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే చాలు.. వేణు స్వామి జ్యోతిష్యం పేరుతో తెర మీదకు వచ్చేస్తారు. త్వరలోనే వారికి ఇది జరగబోతోంది.. చూడండి అంటూ చెప్పేస్తారు. ఆ మాటలతో హీరోలు, హీరోయిన్ల అభిమానులు ఆందోళన పడతారు. ఏమవుతుందోనంటూ.. ఆయన వీడియోలు చూసేస్తుంటారు. తర్వాత ఏం చెబుతుంటారోనని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అలా.. ఇప్పటికే, అనేక మంది ఆరోగ్యం, జీవితాలపై వ్యాఖ్యానించిన వేణు స్వామి.. అప్పట్లో నాగ చైతన్య – సమంత త్వరలోనే విడిపోతారు అని చెప్పి సంచలనం సృష్టించారు. అందుకు తగ్గట్టే.. కొన్నాళ్లకు ఆ జంట విడిపోవడంతో..ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
ఇక అప్పటి నుంచి తరచూ సినీ ప్రముఖుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన వేణు స్వామి.. మరోసారి హీరో నాగార్జున ఫ్యామిలీ విషయంలో కలగుజేసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత చాన్నాళ్లుకు.. శోభిత ధూళిపాళ్లతో వివాహం నిశ్చయం చేసుకోగా, అదీ కొద్ది రోజుల్లోనే చెడిపోతుందని, వాళ్లిద్దరూ విడిపోతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో.. ఆగ్రహించిన నాగార్జున అభిమానులు, సినిమా జర్నలిస్టులు.. కొత్త జంట వైవాహిక జీవితంపై ఇష్టం వచ్చినట్లు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దాంతో.. వేణు స్వామి తమ ముందు హాజరుకావాలంటూ మహిళా కమిషన్ ఆదేశించగా, కమిషన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇప్పుడు తిరస్కరణ ఎదురుకావడంతో.. వేణు స్వామికి తెలంగాణా మహిళా కమిషన్ మరోసారి సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోపు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read : గత ప్రభుత్వం వల్లే రోడ్డున పడ్డాం.. బీఆర్ఎస్‌కు సర్పంచుల షాక్
ఈ ఒక్క వ్యవహారమే కాదు.. ప్రధాని మోదీ ఫోటోను మార్ఫింగ్ చేసారనే అభియోగం మీద కూడూ వేణు స్వామిపై ఓ కేసు నమోదైంది. జాతకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జ్యోతిష్యుడు వేణు స్వామిపై.. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.