Kavitha delhi liquor case news(Telangana news updates): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కల్వకుంట్ల కవితకు బెయిల్ రాబోతోందా? లిక్కర్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత అప్రూవర్ గా మారనున్నారా? ఆగస్టు 12న సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణ జరగనుంది. గత జులై 1న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత తరపున లాయర్లు. అందుకు సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. ఢిల్లీకి వెళ్లొచ్చిన కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కవిత ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. ఆమె ఏకంగా 11 కిలోలు తగ్గారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే కవిత విడుదల కానున్నారని కేటీఆర్ చెబుతున్నారు.
అప్రూవర్ గా మారతారా?
శుక్రవారం ఈ కేసులో కీలక నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిపోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే కేజ్రీవాల్, కవితలకు కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో మనీష్ సిపోడియా అప్రూవర్ గా మారిపోయినందువల్లే బెయిల్ లభించింది. అందుకే కవిత కూడా అప్రూవర్ గా మారిపోతే ఆమెకు కూడా షరతులతో కూడిన బెయిల్ లభిస్తుందని కవిత తరపున లాయర్లు భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ వ్యవహారం నడుస్తోందని గత ఎన్నికలలో బీజేపీకి తెలంగాణలో అంత మెజారిటీ రావడానికి కారణం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలు అవ్వగానే బెయిల్ ఇస్తే అనుమానం వస్తుందని కొంత జాప్యం అయ్యాక పెద్దగా అనుమానాలు రాకపోవచ్చని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.
కేటీఆర్ మాటల వెనక ఆంతర్యమదేనా?
మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేటీఆర్, హరీష్ రావులు విడివిడిగా కేంద్ర మంత్రులను కలిసి కవిత బెయిల్ వ్యవహారంపై ఫలవంతమైన చర్చలు జరిపినట్లు సమాచారం. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చాక కేటీఆర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కవిత త్వరలోనే బయటకు వస్తున్నారని చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను ఒంటరిగా ఎదుర్కోవడం ఇక కష్టమే అని బీఆర్ఎస్ అధినేతలు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని అందుకోసం ముందుగా కవిత కేసు క్లియర్ అయితే తర్వాత మరో అడుగు ముందుకేసి విలీనమా లేక మద్దతా అనే విషయంపై ఓ క్లారిటీకి వద్దామని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. కనీసం ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే తప్పక జాతీయ పార్టీ మద్దతు అవసరాన్ని గుర్తించారు. పొరుగు రాష్ట్రం ఏపీలోనూ బీజేపీతో జతకట్టి టీడీపీ అధికార పగ్గాలు చేపట్టినట్లుగా ఇక్కడ కూడా అక్కడి కూటమి బాటలోనే కేసీఆర్ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీబీఐ కేసులో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుని కవిత అప్రూవర్ గా మారితే ఇక బెయిల్ కూడా ఆలస్యం జరగకుండా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు
ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఊహించని యూటర్న్ లతో కూడిన పెను రాజకీయ మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. దీనితో తెలంగాణలోనూ ఏపీ తరహాలో భారీ పార్లమెంట్ సీట్లు రాబట్టుకోవాలంటే బీజేపీకి కూడా బీఆర్ఎస్ అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలోనూ బీజేపీ గట్టిగా పాగా వేయాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే అని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇన్ని సానుకూల అంశాల మధ్య కవిత విడుదలవడం తథ్యం అని అంతా భావిస్తున్నారు.