Most Beautiful Train Journeys: రైలు ప్రయాణం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు. కిటికీ బయట మారుతున్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ ప్రయాణించాలంటే కొన్ని రైలు మార్గాలు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. కొండలు, లోయలు, అడవులు, జలపాతాలు, సముద్రం.. ఇలా ఒక్కో మార్గంలో ఒక్కో రకమైన అందం కనిపిస్తుంది. అందుకే దేశంలోని కొన్ని రైలు ప్రయాణాలు పర్యాటకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కల్కా నుంచి సిమ్లా వెళ్లే రైలు మార్గం భారతదేశంలోని అందమైన రైలు ప్రయాణాల్లో ప్రముఖంగా చెప్పుకుంటారు. హిమాలయ పర్వత ప్రాంతాల మధ్య సాగే ఈ టాయ్ ట్రైన్ ప్రయాణంలో పచ్చని కొండలు, లోయలు, పైన్ చెట్లు కళ్లకు విందు చేస్తాయి. దాదాపు 102 సొరంగాల గుండా రైలు ప్రయాణించడం ఈ మార్గానికి మరో ప్రత్యేకత. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా ఉంది. నెమ్మదిగా కొండలను ఎక్కుతూ సాగే రైలు ప్రయాణం ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
వాస్కో డ గామా నుంచి లోండా వైపు వెళ్లే రైలు మార్గం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే మరో రూట్. ముఖ్యంగా ధుద్ సాగర్ జలపాతం ఈ ప్రయాణానికి క్రేజీ ఎక్స్ పీరియెన్స్. వర్షాకాలంలో జలపాతం ఉప్పొంగుతూ కనిపించే దృశ్యం మరింత అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు కనిపిస్తూ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
జల్‌పైగురి నుంచి డార్జిలింగ్ వెళ్లే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే కూడా దేశంలోని ప్రసిద్ధ పర్వత రైలు మార్గాల్లో ఒకటి. చిన్న రైలులో కొండల మధ్య ప్రయాణిస్తూ పచ్చని తేయాకు తోటలను చూడటం స్పెషల్ ఎక్స్ పీరియెన్స్. మార్గమధ్యంలో వచ్చే బటాసియా లూప్ ఈ ప్రయాణంలో మరో ఆకర్షణ. చుట్టూ కనిపించే కొండలు, మబ్బులు, పచ్చదనం ప్రయాణానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.
మండపం నుంచి రామేశ్వరం వెళ్లే రైలు ప్రయాణం మిగతా మార్గాలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కొండలు, అడవుల కంటే సముద్రమే ప్రధాన ఆకర్షణ. చారిత్రాత్మక పాంబన్ వంతెన మీదుగా రైలు సాగుతున్నప్పుడు రెండు వైపులా కనిపించే సముద్ర దృశ్యం ప్రయాణికులను ఆకట్టుకుంటుంది.
ముంబై నుంచి గోవా వైపు వెళ్లే కొంకణ్ రైల్వే మార్గం కూడా ప్రకృతి అందాలతో నిండిన ప్రయాణం. పశ్చిమ కనుమల మధ్య నుంచి రైలు దూసుకెళ్తున్నప్పుడు పచ్చని కొండలు, లోయలు, నదులు, సొరంగాలు వరుసగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అరేబియా సముద్ర తీర దృశ్యాలు కూడా ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.
Read Also: భారతీయ రైల్వేలో అత్యంత ఎత్తైన స్టేషన్ ఇదే.. హైట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!