Hyderabad Chit Scam: మనం కష్టపడి సంపాదించిన డబ్బును నాలుగు రాళ్లు వెనకేసుకుందామనో, అవసరాలకు పనికొస్తుందనో నమ్మి ఎక్కడైనా దాచుకుంటాం. కానీ కొందరు ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నడిరోడ్డుపై నిలబెడుతున్నారు. సరిగ్గా హైదరాబాద్‌లోనూ అదే జరిగింది. చీటీలు, ఎక్కువ వడ్డీల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి ఓ కుటుంబం ఏకంగా రూ.16 కోట్లతో పరారైంది.
నమ్మించి గొంతు కోశారు!
హైదరాబాద్‌కు చెందిన తల్లి, తండ్రి, కుమార్తె ముగ్గురూ కలిసి ఈ మోసానికి తెరలేపారు. తెలిసిన వారే కదా అని నమ్మి సుమారు 44 మంది బాధితులు వీరికి తమ వద్ద ఉన్న డబ్బులను చీటీల రూపంలో, ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో సమర్పించారు. మొదట్లో క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తున్నట్లు నమ్మించి, ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టారు.
ఫోన్లు స్విచ్ఛాఫ్.. బాధితుల గుండెల్లో రైళ్లు!
బాధితుల నుంచి పెద్ద మొత్తంలో దాదాపు రూ.16 కోట్లు చేతికి అందగానే ఆ కుటుంబం రాత్రికి రాత్రే జారుకుంది. బాధితులు తమ డబ్బుల కోసం ఎంత ప్రయత్నించినా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు.
ఈవోడబ్ల్యూ పోలీసుల రంగ ప్రవేశం
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. మోసానికి పాల్పడిన తల్లి, తండ్రి, కుమార్తెలపై కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక్కసారిగా గాల్లో కలిసిపోవడంతో బాధితుల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడి అల్లాడుతున్నాయి. ఎంత తెలిసిన వారైనా సరే.. అనధికార చీటీలు, ఆశ చూపే వడ్డీ వ్యాపారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
Also Read: ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్