Bhuvanagiri Fort Ropeway: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి కోటకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్నది. అత్యంత ఎత్తైన ఏకరాతి గుట్టపై ప్రాచీన కాలంలో నిర్మితమైన ఈ కోటను చూసేందుకు నిత్యం పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ కోటపై ట్రెక్కింగ్ చేసేందుకు యువతీ యువకులు ఆసక్తి చూపిస్తుంటారు. క్రమ క్రమంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోట పరిసరాల అభివృద్ధికి పర్యాటకశాఖ కీలక చర్యలు చేపట్టింది. భువనగిరి ఖిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో మూడు చోట్ల రోప్ వేల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది.
స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా..
తెలంగాణలో గోల్కొండ కోట, వరంగల్ కోటకు ఎంత ప్రధాన్యత ఉన్నదో, భువనగిరి ఖిల్లాకు అంతే ప్రాధాన్యత ఉన్నది. ఎంతో చారిత్ర నేపథ్యం ఉన్న భువనగిరి కోటను స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా రూ. 56.81 కోట్ల వ్యయంతో కోటను అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. భువనగిరి కోట సమీపంలోనే ఉన్న హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి నుంచి కోట దగ్గరికి కిలో మీటరు దూరం మేర రూప్ వే ఏర్పాటు చేయబోతున్నారు.
రాష్ట్రంలోనే తొలి రోప్ వేగా గుర్తింపు
భువనగిరి ఖిల్లా రోప్ వే రాష్ట్రంలోనే తొలి రోప్ వేగా గుర్తింపు పొందనుంది. ట్రెక్కింగ్ ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ఒకటైన భువనగిరి కోట పైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతుంది. రోప్ వే ఏర్పాటుతో పర్యాటకులు నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. అందే సమయంలో మరింత థ్రిల్ గా ఫీల్ కానున్నారు. ఖిల్లా పైకి రోప్ నిర్మించడంతో పాటు కోట మీద ఉన్న నీటి కొలను, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ప్రవేశ ద్వారం, రోడ్లు, పార్కింగ్ ఏర్పాటు మరింత డెవలప్ చేయనున్నారు.
మరో మూడు ప్రాంతాల్లో రోప్ వేల నిర్మాణం
భునగిరి కోటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో మూడు ప్రాంతాల్లో రోప్ వే ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్వతమాల ప్రాజెక్టు కింద వీటిని మంజూరు చేయాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 2 కిలో మీటర్లు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2 కిలో మీటర్లు, నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా 5 కి.మీ రోప్ వే ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ రోప్ వేలు పూర్తయితే పర్యటకుల సంఖ్య పెరగడంతో పాటు ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతాలు ఆర్ధికంగా ఎదిగే అవకాశం ఉంటుంది.
భువనగిరి కోట పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రదేశంగా కొనసాగుతుండగా, ఈ రోప్ వే పూర్తయితే టూరిస్టుల సంఖ్య మరింత పెరగనుంది. కోటపైకి పర్యాటకులు ఈజీగా చేరుకోనున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ రోప్ వేతో సాగర్ డ్యామ్ పర్యాటక హాట్ స్పాట్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యామ్ పైకి చేరేందుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ, రోప్ వే ద్వారా మరింత ఆకర్షణ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక నల్లగొండలోని హనుమాన్ దేవాలయం రోప్ వే ఏర్పాటు చేయడం వల్ల భక్తుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి రోప్ వే ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు అదనపు ప్రయోజనంగా మారనుంది.
Read Also:పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!