Amaravati railway line: ఆ దారిలో రైలు మార్గం కోసం అన్ని చర్యలు మొదలయ్యాయి. కానీ అందులో మళ్లీ ఒక బ్రేక్ కనిపిస్తోంది. ఎక్కడంటే గుంటూరు జిల్లాలోని కొప్పురవూరులో. అమరావతికి వేయబోయే రైలు మార్గం ఇప్పుడు అక్కడి రైతులకు ఓ పెద్ద ప్రశ్నగా మారింది. రైలు ప్రాజెక్టు కోసం భూములు తీసుకుంటామని అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆందోళన మొదలైంది.
అమరావతి అభివృద్ధికి అనుసంధానంగా ప్రభుత్వం చేపట్టిన పెద్ద ప్రాజెక్టులలో ఒకటి.. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు వెళ్తున్న కొత్త రైలు మార్గం. మొత్తం పొడవు 56 కిలోమీటర్లు. ఇందులో మొదటి దశగా 27 కిలోమీటర్ల మార్గాన్ని వేయాలని రైల్వే శాఖ ప్లాన్ చేసింది. ఇందులో కొప్పురవూరు గ్రామం కీలకం. అక్కడ 2.57 కిలోమీటర్ల ట్రాక్ వేయాల్సి ఉంది. అందుకే అక్కడి రైతులకు భూములు కావాలంటూ అధికార నోటీసులు ఇచ్చారు.
జూలై 22లోపు అభ్యంతరాలు చెప్పండి
ఈ నోటీసుల ప్రకారం, భూముల యజమానులు తమ అభ్యంతరాలను జూలై 22 లోపు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సంబంధిత అధికారులకు పంపించాలి. అదే ఆఖరి గడువు. కానీ రైతులు నోటీసులు ఒక్కసారిగా వచ్చేసాయి. ఏమీ అర్థం కాక ముందే గడువు దగ్గరపడుతోంది అంటూ తమ వాదన తెలుపుతున్న పరిస్థితి. కొంత మంది రైతులు, ఈ రైలు దారికి మళ్లీ ఆలోచించి, మార్గాన్ని చక్కదిద్దితే తమ భూములు మిగులుతాయని అభిప్రాయపడుతున్నారు.
రూ.2,545 కోట్ల భారీ వ్యయం
ఈ ప్రాజెక్టు మొత్తం రూ.2,545 కోట్లు ఖర్చుతో నిర్మించనున్నారు. నాలుగేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర రైల్వే శాఖ ముందుకెళ్తోంది. నంబూరు జంక్షన్ నుంచి ఎర్రుపాలెం వరకు ఈ రైలు మార్గం రానుంది. దక్షిణ రైల్వే నెట్‌వర్క్‌తో అమరావతిని కలిపే ప్రయత్నంలో ఇది కీలకం. రాబోయే కాలంలో విజయవాడ, ఖమ్మం, వరంగల్ వరకు కనెక్టివిటీ బాగా మెరుగవుతుందన్నది అధికారుల అంచనా.
రైలు వస్తే ప్రయోజనమేనా..?
రైలు వస్తే ప్రయాణం వేగంగా ఉంటుంది. సరుకు రవాణా అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు కనెక్టివిటీ మెరుగవుతుంది. అమరావతిలో కొత్త వ్యాపారాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొందరు రైతులు ఇదొక ప్రయోజనకమని తెలుపుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఇంతవరకు భూములకు ఎంత పరిహారం ఇవ్వబోతున్నారో, పునరావాసం ఎలా ఉంటుందన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని కొందరు రైతులు తెలుపుతున్నారు. నోటీసుల్లో కేవలం భూములు అవసరం, అభ్యంతరాలు ఉంటే పంపండనే మేరకే ఉంది. దీంతో రైతుల్లో గందరగోళం పెరిగిపోయింది. కొంతమంది రైతులు గ్రామస్థాయిలో సమావేశాలు జరిపి ఒక నిర్ణయం తీసుకోవాలని చర్చలు సాగిస్తున్నారట.
Also Read: Special trains 2025: గణేష్ ఉత్సవ్ ఎఫెక్ట్.. 280 స్పెషల్ ట్రైన్స్ మీకోసమే.. డోంట్ మిస్!
రైతులు కోరేది ఒక్కటే.. అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ తమతో చర్చించి, న్యాయమైన పరిహారం ఇస్తే తప్ప అన్యాయంగా భూములు తీసుకోవద్దని అంటున్నారు. ఈ రోజు మా భూములు పోతే, రేపు మాకు ఆ భూముల విలువ చెప్పే శాశ్వత ఆదాయం మిగలదు. కనీసం అదే స్థాయిలో జీవనం సాగించే అవకాశమిస్తే సరి అంటున్నారు.
ఇతర గ్రామాల్లోనూ అదే పరిస్థితి రావొచ్చు
కేవలం కొప్పురవూరే కాదు. ఈ ప్రాజెక్టు మార్గంలో పలు గ్రామాలు ఉన్న నేపథ్యంలో అక్కడా భూ స్వాధీనం జరగనుంది. తద్వారా మరిన్ని రైతుల భూములు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీసే అవకాశం ఉంది. అందుకే మొదటి దశలోనే ప్రభుత్వం రైతులతో సంభాషించి పరిష్కారం చూపిస్తే మేలు అని పౌరసంఘాలు సూచిస్తున్నాయి.