APSRTC Discount Offer: ప్రజలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేలా ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే చక్కటి ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరపై 20 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు వెల్లడించింది. చలికాలం కావడంతో ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న ఆఫర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డిసెంబర్ 10 వరకు స్పెషల్ ఆఫర్లు
ఏపీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ ఆఫర్ కేవలం ఏసీ బస్సుల్లోనే ఉంటుంది. శీతాకాలం రావడంతో ఏసీ బస్సులకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రయాణీకుల సంఖ్యను పెంచాలని.. ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ నెల 1 నుంచి 10 వరకు ఏపీఎస్ ఆర్టీసీ కొన్ని ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై 20 శాతం తగ్గింపు అందిస్తున్నది. మిగిలిన బస్సుల్లో అప్ అండ్ డౌన్ టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటే ఛార్జీలపై 10 శాతం రాయితీ ప్రకటించింది.
ఏపీఎస్ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్లు
ఆర్టీసీ ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ల వివరాలను పరిశీలిస్తే.. విజయవాడ-హైదరాబాద్ రూట్ లో నడిచే అన్ని డాల్ఫిన్ క్రూజ్, అమరావతి బస్సులపై అప్ అండ్ డౌన్ బుకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నారు. అయితే, ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్) మినహా మిగిలిన రోజుల్లో ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ బస్సుల్లో ఛార్జీ సాధారణంగా రూ. 770 ఉండగా, 10 శాతం రాయితీ తర్వాత రూ. 700కు లభించనుంది. ఇక విజయవాడ-బెంగళూరు, బెంగళూరు- అమరావతి మధ్య నడిచే వెన్నెల స్లీపర్ బస్సులపై ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్) మినహా మెజిస్టిక్ బస్ స్టేషన్ వరకు 20 శాతం తగ్గింపును అందిస్తున్నారు. ఈ బస్సుల్లో ధర సాధారణంగా రూ. 2,170 ఉంటుంది. ఆఫర్ తర్వాత రూ.1,770కి లభిస్తుంది. అటు అమరావతి మల్టీయాక్సిల్ ధర సాధారణంగా రూ. 1,870 ఉండగా, ఆఫర్ తర్వాత రూ. 1,530కే లభిస్తున్నది. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సులు 10 శాతం తగ్గింపును అందిస్తున్నాయి. సాధారణంగా ఈ బస్సు ఛార్జీ రూ. 1,070 ఉండగా, ఆఫర్ తర్వాత రూ.970కి లభిస్తున్నది.
Read Also: మెట్రో కొత్త కారిడార్‌లలో వచ్చే స్టేషన్స్ ఇవే.. మ్యాప్‌లతో సహా పూర్తి వివరాలు మీ కోసం!
గత కొద్ది రోజులుగా ఏసీ బస్సుల్లో తగ్గిన ఆక్యుపెన్సీ
విజయవాడ- హైదరాబాద్ రూట్ లో నడిచే బస్సుల్లో గత నెలలో ఆక్యుపెన్సీ 53 శాతం ఉంది. అటు బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు ఆక్యుపెన్సీ 57 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఆర్టీసీ అధికారులు దృష్టిసారించారు. అందులో భాగంగానే ఏసీ బస్సుల్లో టికెట్లపై రాయితీ ప్రకటించారు. ఈ బంఫర్ ఆఫర్లను ప్రయాణీకులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 10 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలంటున్నారు.
Read Also: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!