కొందరికి జీవితంలో తోడు దొరకదు. ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అలాంటి వారికి గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకిచ్చే సర్వీసులు వచ్చాయి. రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ సేవలు ఎన్నో దేశాల్లో ఉన్నాయి. అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ తో హద్దు దాటకుండా ప్రవర్తించాలి. ఆమెను శారీరకంగా బాధించకూడదు. లైంగికపరమైన కోరికలను తీర్చమని అడగకూడదు. మీ ప్రయాణంలో లేదా ఏదైనా వేడుకల్లో మీ పక్కన మీ గర్ల్ ఫ్రెండ్ గా కాసేపు ఆనందాన్ని ఇచ్చేందుకు మాత్రమే ఆమె ఉంటుంది. ఇవి చైనాలో, జపాన్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన సర్వీసులుగా ఇప్పుడు మారాయి.
రెంట్ ఎ గర్ల్ ఫ్రెండ్ సేవలో కొన్ని గంటలపాటు లేదా ఒక రోజు పాటు ఒక అమ్మాయి మీకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుంది. ఇందుకోసం మీరు కొంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. మీతో పాటు లాంగ్ డ్రైవ్ కి రావడం లేదా రెస్టారెంట్లో కంపెనీ ఇవ్వడం ఏదైనా సామాజిక వేడుకలకు హాజరవడం వంటివి ఈ గర్ల్ ఫ్రెండ్ చేస్తుంది. భాగస్వామి లేక ఎంతో మంది సామాజికంగా ఒత్తిడిని ఎదుర్కుంటారు. అలాంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
రెండు గంటలకు ఒక అమ్మాయి
జపాన్లోని టోక్యో, ఒసాకో, క్యోటో వంటి నగరాల్లో రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ సేవలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వెబ్సైట్లో రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు మీకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకోవచ్చు. వారి వివరాలు వయస్సు, ఫోటోలతో పాటు అక్కడ ఉంటాయి. ఆ ప్రొఫైల్ ను వారు మాట్లాడే భాషలను బట్టి మీరు ఎంచుకొని సమయాన్ని కూడా బుక్ చేసుకోవాలి. అలాగే ఎక్కడికి వచ్చి కలవాలో ఆ ప్రదేశాలను కూడా ముందే చెప్పాలి. ఇందుకోసం ముందుగానే కొంత మొత్తంలో చెల్లించాలి. గంటకు జపాన్లో ఐదువేల నుండి ఎనిమిది వేల జపాన్ కరెన్సీ చెల్లించాల్సి వస్తుంది. అంటే మన రూపాయిల్లో గంటకు 2,900 రూపాయల నుండి 4,640 వరకు చెల్లించాలి. అయితే కనీసం రెండు గంటల పాటు ఒక అమ్మాయిని బుక్ చేసుకోవాలి.
అలాగే ఆమెకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. అంటే ఆమె మీరు ఉన్న ప్రదేశానికి వచ్చేందుకు అయ్యే ప్రయాణపు ఖర్చులను కూడా భరించాలి. అలాగే ఆమె భోజనాలు, సినిమా టికెట్లు లేదా ఈవెంట్ కు వెళ్లడానికి ఎంట్రీ ఫీజులు అన్ని మీరే చెల్లించాలి. ఇవన్నీ కలిపి ఎక్కువే అవుతాయి. మన రూపాయల్లో చూసుకుంటే ఒక అమ్మాయిని రెండు గంటల పాటు అద్దెకు తీసుకోవాలంటే 10,000 రూపాయల నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది.
నియమాలు ఇవే
మీరు అమ్మాయితో ఎలాంటి శారీరక సంబంధాన్ని పెట్టుకోవడానికి వీలు లేదు. కానీ ఆమె చేతులను మీరు ప్రేమగా పట్టుకోవచ్చు. ఆమె చేతులను పట్టుకోవడం వరకే మీకు అనుమతి ఉంటుంది. ఆమెకి బహుమతులు ఇవ్వడం, ఫోన్ నెంబర్ అడగడం వంటివి నిషిద్ధం.
జపాన్ లో రెంట్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఎంతో ప్రజాదరణ పొందింది. దీనికి కారణం ఒంటరితనం. ఎంతోమంది అక్కడ సామాజికంగా ఒంటరి వారిగా మిగిలిపోయారు. ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి వారు ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతున్నారు. అందుకే రెంట్ ఎ గర్ల్ ఫ్రెండ్ సేవలు జపాన్లో ఎక్కువగా ఆదరణ పొందాయి.
చైనాలో కూడా
చైనాలో కూడా ఇప్పుడిప్పుడే రెంట్ ఎ గర్ల్ ఫ్రెండ్ సేవలు బాగా ఊపందుకుంటున్నాయి. సెలవు దినాల్లో లేదా వేడుకల సమయంలో ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్న అబ్బాయిల సంఖ్య అధికంగానే ఉంది. ఇది కూడా జపాన్లోలాగే ఖర్చుతో కూడుకున్నది. ఏదైనా పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా బయటికి అలా షికారుకి వెళ్లాలనుకున్న ఇలా ఒక గర్ల్ ఫ్రెండ్ ని బుక్ చేసుకుంటున్నారు. చైనాలో కూడా రోజుకు ఒక గర్ల్ ఫ్రెండ్ ని బుక్ చేసుకునేందుకు 2,360 రూపాయలు నుంచి 11,800 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆమె మీతో కలిసి మద్యం తాగాలంటే అందుకు మీరు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి. అలాగే ఆమె మీతో ప్రేమగా ప్రవర్తించాలన్నా కూడా వేరేగా డబ్బులు కట్టాలి. కాబట్టి ఎలా చూసుకున్నా రోజుకు 15 వేల రూపాయలు ఖర్చవుతుంది.
చైనా తర్వాత అమెరికాలో కూడా ఇలాంటి సర్వీసులు నడుస్తున్నాయి. సైట్ సీయింగ్‌కు వెళ్లాలనుకునే వారికి ఈవెంట్లకు హాజరు కావాలనుకునే వారికి యుఎస్, కెనడా యూరోప్ లోని కొన్ని దేశాల్లో గర్ల్ ఫ్రెండ్ అద్దెకు వస్తోంది. అక్కడ కూడా దాదాపు అయ్యే ఖర్చు జపాన్, చైనాలో ఉన్నట్టే ఉంది.
మనదేశంలో…
మన దేశం విషయానికి వస్తే మన దేశంలో గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకి తీసుకునే సేవలు ఎక్కడా లేవు. కానీ బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చే సేవలు మాత్రం ఉన్నాయి. ఇవి డేటింగ్ సరోగసిని కూడా అందిస్తాయి. దీనికి కూడా ఖర్చు ₹2000 నుంచి 10000 వరకు అవుతుంది.
థాయిలాండ్ లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశంలో మాత్రం రెంట్ ఎ గర్ల్ ఫ్రెండ్ చాలా ఖరీదైనది. అయితే ఇక్కడ అంత సురక్షితమైన సేవలు అందవు. లైంగిక ప్రక్రియల వరకు పరిస్థితులు చేజారుతాయి. థాయిలాండ్ లో మాత్రం రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ సేవలు వాడుకునేవారు జాగ్రత్తగా ఉండాలి.