Trains Bedsheet Stealing Punishment| భారతదేశంలో ఎక్కువశాతం మంది ప్రయాణం చేయడానికి రైలు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ప్రయాణంలో వెసులుబాటు, బస్సు లేదా విమాన మార్గం కంటే తక్కువ ధర కావడంతో రైలు మార్గానికి అందరూ ప్రాధాన్యం ఇస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు సగటున 2 కోట్ల 40 లక్షల మంది రైలు ప్రయాణం చేస్తున్నారని రైల్వే డేటా ద్వారా తెలుస్తోంది. అయితే ఇంత వసతులు అందిస్తున్నా రైల్వే ఆస్తులను మాత్రం కొందరు దోచుకెళుతున్నారు. ఇలాంటి వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధించబడతాయి. రైల్వే చట్టం 1989 ప్రకారం.. రైల్వే ఆస్తులు దొంగతనం చేయడం లేదా వాటిని దుర్వినియోగం చేసే వారికి ఫైను విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.
ముఖ్యంగా ఏసీ క్లాస్‌లో ప్రయాణికుల కోసం రైల్వే తరపున బెడ్ షీట్లు, దిండ్లు అందిస్తారు. ప్రయాణికులకు ఈ వసతులు ప్రయాణం వరకే పరిమితం. కానీ కొందరు ఆ బెడ్ షీట్లు, దిండ్లు ప్రయాణం తరువాత దర్జాగా ఇంటికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లడం చట్ట ప్రకారం నేరం. కానీ భారత దేశంలో ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బ్లాంకెట్స్, బెడ్ షీట్లు, దిండ్లు నిత్యం రైల్వే ఏసీ క్లాసుల నుంచి మాయమవుతున్నాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.
రైల్వే రిపోర్ట్ ప్రకారం.. 2023-24 సంవత్సరంలో మొత్తం 18,208 బెడ్ షీట్లు, 2796 బ్లాంకెట్లు, 19767 పిల్లో కవర్లు, అత్యధికంగా అంటే 3 లక్షలకు పైగా (3,08,505) టవళ్లు దొంగతన మయ్యాయి. అయితే ఇలా రైల్వే వస్తువులను తీసుకెళ్లే ఏం శిక్షలు విధిస్తారో ఒకసారి చూద్దాం.
Also Read: దక్షిణభారత్ టూర్ ప్లాన్.. తక్కువ ధరకే రైలు ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆలయాల దర్శనం
రైల్వే చట్టంలో దొంగతనం చేసేవారికి శిక్షలు ఈ విధంగా ఉన్నాయి.
1. రైల్వే ప్రాప్టరీ చట్టం 1966 ప్రకారం.. రైల్వే ఆస్తులు కలిగిఉండడం, వాటిని దొంగలించడం శిక్షార్హమైన నేరం. మొదటిసారి ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలకు జైలు విధించే అవకాశం ఉంది.
2. అలాగే రైల్వే చట్టం 1989, సెక్షన్ 147 ప్రకారం.. ట్రైన్లలో, రైల్వే పరిసరాల్లో అనుమతి లేకుండా ప్రవేశించినా.. రైల్వే ఆస్తులు దుర్వినియోగం చేసినా లేదా రైల్వే ఆస్తులు చట్ట వ్యతిరేకంగా తీసుకెళ్లినా, దొంగిలించినా.. మొదటిసారి అయితే ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తారు.
3. సెక్షన్ 145 ప్రకారం అయితే దొంగతనం చేయడంతో పాటు ట్రైన్లో లేదా రైల్వే పరిసరాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం. లేదా దురుసుగా వ్యవహరిస్తే.. దోషికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.500 ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది.
రైల్వే ఆస్తుల దొంగతనం కేసుల్లో ఎక్కువ శాతం ప్రయాణికులు బెడ్ షీట్లు, బ్లాంకెట్లు వంటివి తీసుకెళుతున్న కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆన్ ది స్పాట్ దోషికి రూ.500 లేదా రూ.1000 జరిమానా విధిస్తారు. ఇలాంటి కేసుల్లో మళ్లీ మళ్లీ రిపీట్ అయితే అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేస్తారు. ఆ తరువాత కోర్టులో కేసు విచారణకు వెళుతుంది. కోర్టు ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు విధించే అవకాశాలున్నాయి.
ఈ శిక్షలతో పాటు పలుమార్లు రైల్వే ఆస్తులను దొంగతనం చేసేవారికి రైలు ప్రయాణం చేయకుండా బ్లాక్ లిస్ట్ చేస్తారు. వీరు ఇక జీవితంలో రైలు టికెట్ బుక్ చేసుకోలేరు.
బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, దిండ్లు దొంగతనం కేసులు ఎక్కువ కావడంతో రైల్వే అధికారులు ఇప్పుడు వీటిపై ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్, సీరియల్ నెంబర్స్, పెడుతున్నారు. ఒక వేళ దొంగతనం అయితే త్వరగా దొంగలను పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయి.
ఇలా బెడ్ షీట్లు, దిండ్లు దొంగలించడం చిన్న నేరమైనా.. ప్రభుత్వ ఆస్తులు దొంగలించడం చట్ట రీత్యా శిక్షార్హమని ప్రజలు గమనించాలి. ఎవరి వద్దనైనా ఇలాంటి వస్తువులు ఉంటే వాటిని తిరిగి ఇచ్చేయాలని రైల్వే అధికారులు ఇప్పటికే పలుమార్లు విజ్నప్తి చేస్తున్నారు.