Jyotji Malhotra Hyderabad Vande Bharat Video: దాయాది దేశం పాకిస్తాన్ కు గూఢచారిగా వ్యవహరిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ కు సంబంధించి రహస్య సమాచారాన్ని పాక్ చేరవేస్తున్నట్లు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె గూఢచార్యం చేసినట్లు తేలింది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వీఐపీ పాస్ తో హల్ చల్
2023 సెప్టెంబర్ లో హైదరాబాద్- బెంగళూరు వందే భారత్ రైలును ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఆమె హల్ చల్ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వీఐపీ పాస్ తీసుకుని మరీ రైల్లో ప్రయాణించింది. రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణీకులను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించింది. అప్పుడు తన యూట్యూబ్ లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తిరుగుతోంది. దేశంలోని అనేక రహస్యాలతో పాటు వందేభారత్ రైళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆమె పాకిస్తాన్ కు షేర్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
BJP is giving free VIP pass to Pakistani spy #JyotiMalhotra for events.
Don't these guys do background verification before allowing these traitors. pic.twitter.com/uoy3dNXsp1
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) May 18, 2025
ఈ నెల 17న గూఢచర్యం కేసులో జ్యోతి అరెస్ట్
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దేశంలోని అంతర్గత భద్రతపై దృష్టిసారించిన భద్రతా బలగాలు.. ఇండియాకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. హర్యానాలోని హిస్సార్ కు చెందిన జ్యోతి మల్హోత్రా భారత సున్నిత సమాచారాన్ని పాక్ కు అందిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ లో ప్రారంభమైన వందేభారత్ రైల్లోకి వీఐపీ పాస్ తో ఎంట్రీ ఇచ్చినట్లు తేలింది. ఆమె హైదరాబాద్ కు వచ్చింది కేవలం ఈ కార్యక్రమం కోసమేనా? లేకపోతే, కేంద్ర మంత్రులు, వందేభారత్ కు సంబంధించిన వివరాలను పాక్ చేరవేసేందుకు వచ్చిందా? అనే విషయంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆ సమయంలో హైదరాబాద్ లో ఎవరినైనా కలిసిందా? అనే అంశం పైనా పరిశీలన చేస్తున్నారు.
ఐఎస్ఐ అస్త్రంగా జ్యోతి మల్హోత్రా
జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కోర్టు అనుమతితో విచారణ జరుపుతున్నారు. ఆమెను ఐఎస్ఐ ఏజెంట్లు పావుగా మలుచుకుని కీలక సమాచారాన్ని రాబట్టినట్లు గుర్తించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆమె పాక్ రాయబార కార్యాలయ అధికారితో కీలక విషయాలను పంచుకున్నట్లు తెలుసుకున్నారు. పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె నుంచి సేకరించన సమాచారాన్ని భద్రతా కారణాల నేపథ్యంలో బయటకు చెప్పలేమని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ వెల్లడించారు.
Read Also: ఆడవాళ్లకు ఒక భాష.. మగవాళ్లకు మరో భాష.. ప్రపంచంలోనే వింత గ్రామం!