Hyderabad Bullet Train: భారత్ లో బుల్లెట్ రైలు సేవలకు మార్గం సుగమమవుతోంది. దేశంలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్టుగా ముంబై–అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన బుల్లెట్ రైళ్ల విషయంలో వేగంపై కొత్త చర్చ మొదలైంది. గతంలో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయని ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న రైళ్ల ఆపరేషనల్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ హైస్పీడ్ రైళ్ల కోసం విదేశీ రైళ్లపై పూర్తిగా ఆధారపడకుండా దేశీయంగా రైళ్లను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుకు జపాన్ సాంకేతిక సహకారం అందిస్తోంది. మొదట ఈ కారిడార్ కోసం జపాన్‌కు చెందిన షింకన్సెన్ రైళ్లను ఉపయోగించాలని భావించారు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు కాగా, ఆపరేషనల్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉండేలా ప్రణాళికలు ఉన్నాయి. అయితే, ఒక్కో రైలు సెట్‌కు భారీగా ఖర్చు అవుతుండటంతో దేశీయంగా హైస్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది.
వందే భారత్ రైళ్ల తయారీ, పనితీరు దేశీయంగా హైస్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహంగా మారింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగళూరులోని BEML కలిసి కొత్త హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. ఇప్పటికే రైలు డిజైన్‌కు ఆమోదం లభించినట్లు సమాచారం. వచ్చే ఏడాది తొలి భాగంలో మొదటి ప్రోటోటైప్ సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఒక్కో రైలు సెట్ తయారీకి సుమారు రూ.435 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
దేశీయంగా తయారు చేయబోయే ఈ హైస్పీడ్ రైలు గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండనుంది. అయితే, సాధారణ కార్యకలాపాల్లో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిపించే అవకాశం ఉంది. ఈ రైళ్లు కొన్నేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత మరింత వేగంగా ప్రయాణించే B35 రకం రైళ్లను అభివృద్ధి చేయాలనే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రైళ్ల ఆపరేషనల్ స్పీడ్ గంటకు 350 కిలోమీటర్ల వరకు ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా పలు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు. హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై మార్గాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశీయ రైళ్లను ఉపయోగిస్తే హైదరాబాద్–ముంబై ప్రయాణానికి సుమారు 3 గంటల 25 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్–బెంగళూరు ప్రయాణ సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలు, హైదరాబాద్–చెన్నై ప్రయాణానికి సుమారు 2 గంటల 55 నిమిషాలు పట్టవచ్చని అంచనా. జపాన్ హైస్పీడ్ రైళ్లను ఉపయోగించే పరిస్థితితో పోలిస్తే ఈ ప్రయాణ సమయాలు కొంత ఎక్కువగా ఉంటుంది.
Read Also: బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?