Cherrapunji: మేఘాలయలో ఈస్ట్ ఖాసీ హిల్స్‌లో దాగి ఉన్న చెర్రాపుంజిని స్థానికంగా సోహ్రా అని పిలుస్తారు. నీళ్లు, అడవులు, సాహసాలు, లేదా కొంచెం ప్రశాంతత కావాలనుకునే వాళ్లకి ఇది స్వర్గం లాంటి ప్రదేశం. షిల్లాంగ్ నుంచి సుమారు 50 కి.మీ. దూరంలో ఉంది ఈ హిల్ స్టేషన్. ఒకప్పుడు భూమ్మీద అత్యంత తడి ప్రాంతంగా పేరొందిన చెర్రాపుంజి, ఇప్పుడు అద్భుతమైన జలపాతాలు, ప్రత్యేకమైన లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు, రహస్యమైన గుహలు, ఖాసీ సంస్కృతితో టూరిస్టులను ఆకర్షిస్తోంది. అక్కడికి వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఏంటంటే..
డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు
నీళ్లమీద కట్టిన ఈ బ్రిడ్జ్‌లు చెర్రాపుంజి స్పెషల్. నొంగ్రియాట్ గ్రామంలోని ఉమ్‌షియాంగ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్‌ని ఖాసీ తెగ వాళ్లు రబ్బర్ ఫిగ్ చెట్ల రూట్స్‌తో రూపొందించారు. ఇదొక ప్రకృతి అద్భుతం! టైర్నా గ్రామం నుంచి 3,500 మెట్లు దిగి, అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తే చేరుకోవచ్చు. షార్ట్ ట్రిప్ కావాలంటే, మావ్‌లిన్నాంగ్ దగ్గర రివాయ్ గ్రామంలో సింగిల్ రూట్ బ్రిడ్జ్ చూడొచ్చు.
నోహ్కాలికై జలపాతం
ఇండియాలోనే అతి ఎత్తైన ఈ జలపాతం 1,115 అడుగుల ఎత్తు నుంచి టర్కాయిస్ నీటి కొలనులోకి దూకుతుంది. వర్షాకాలంలో దీని రూపం అదిరిపోతుంది. పార్కింగ్ ఏరియా నుంచి కొద్దిగా నడిచి వ్యూపాయింట్‌కి చేరొచ్చు లేదా దగ్గరగా చూడాలనుకుంటే బేస్‌కి హైక్ చేయొచ్చు.
సెవెన్ సిస్టర్స్ జలపాతం
మావ్‌స్మాయ్ గ్రామంలోని నోహ్స్‌ంగితియాంగ్ జలపాతం, 1,033 అడుగుల ఎత్తు నుంచి ఏడు పాయలుగా దూకుతుంది—నార్త్‌ఈస్ట్ ఏడు రాష్ట్రాలకు ప్రతీకగా. వర్షాకాలంలో ఇక్కడ ఇంద్రధనుస్సులు కనిపిస్తాయి. మావ్‌స్మాయ్ నొంగ్‌తిమ్మాయ్ ఈకో పార్క్ నుంచి సులభంగా చూడొచ్చు.
మావ్‌స్మాయ్ గుహ
చెర్రాపుంజి బస్ స్టాండ్ నుంచి 4 కి.మీ. దూరంలో ఉన్న ఈ 150 మీటర్ల లైమ్‌స్టోన్ గుహలో స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్, చిన్న చిన్న పాసేజ్‌లు అద్భుతంగా ఉంటాయి. లైటింగ్ ఉంది, కానీ మంచి షూస్ వేసుకోవడం మర్చిపోవద్దు.
మావ్‌స్మాయ్ నొంగ్‌తిమ్మాయ్ ఈకో పార్క్
ఈ పార్క్‌లో కొండలు, లోయలు, దూరంగా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ మైదానాలు, సెవెన్ సిస్టర్స్ జలపాతం కనిపిస్తాయి. పిల్లల ఆట స్థలం, ఆర్కిడ్ గార్డెన్, క్రాస్‌ఓవర్ బ్రిడ్జ్‌తో ఫొటోలకు అద్దిరిపోతుంది.
మావ్‌డోక్ డింపెప్ వ్యూ పాయింట్
షిల్లాంగ్ నుంచి చెర్రాపుంజి వెళ్లే దారిలో ఈ స్పాట్‌లో V-ఆకార లోయ, మంచు కొండలు సూపర్ వ్యూ ఇస్తాయి. దువాన్ సింగ్ సయీమ్ బ్రిడ్జ్ దగ్గర ఆగి ఫొటోలు తీసుకోవచ్చు. స్థానిక ఖాసీ దుస్తులు అద్దెకు తీసుకుని ఫొటోలు దిగొచ్చు.
ALSO READ: లవర్‌తో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా.. ఇది పర్ఫెక్ట్ ప్లేస్
ఖాసీ సంస్కృతి, ఆఫ్‌బీట్ స్పాట్స్
చెర్రాపుంజి కేవలం ప్రకృతి గురించి కాదు. ఖాసీ సంస్కృతి కూడా స్పెషల్. మావ్‌స్మాయ్ జలపాతం దగ్గర ఖాసీ మోనోలిత్స్ చూడొచ్చు. రామకృష్ణ మిషన్ మ్యూజియం ఖాసీ హెరిటేజ్ గురించి తెలుసుకోవడానికి బెస్ట్. అర్వాహ్ గుహలో మిలియన్ సంవత్సరాల నాటి ఫాసిల్స్ చూసే అవకాశం ఉంది. దగ్గర్లోని మావ్‌లిన్నాంగ్, డావ్కీలోని ఉమ్‌ంగోట్ రివర్ కూడా చూడాల్సినవే.
ఎప్పుడు వెళ్లాలి?
అక్టోబర్ నుంచి మే వరకు చెర్రాపుంజి వెళ్లడానికి బెస్ట్ టైమ్.. వాతావరణం బాగుంటుంది, ట్రెక్కింగ్ సేఫ్. వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫోర్స్‌లో ఉంటాయి. లైట్‌మావ్‌సియాంగ్ లేదా సోహ్రా మార్కెట్‌లో హోటల్స్ ముందే బుక్ చేసుకోండి. మంచి ట్రెక్కింగ్ షూస్, స్థానిక గైడ్ తీసుకోవడం మంచిది. వాళ్లు రూట్స్, స్టోరీస్ గురించి బాగా చెబుతారు.