China Railway Line: డ్రాగన్ కంట్రీ అక్సాయ్ చిన్ ద్వారా భారతదేశ వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలోని టిబెట్-జిన్జియాంగ్ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. ఈ రైల్వే లైన్ ద్వారా భవిష్యత్ లో అవసరమైతే భారత్ తో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, చైనా రైల్వే నిర్మాణం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అక్సాయ్ చిన్ భారతదేశంలో అంతర్భాగం. కానీ. 1950 నుంచి చైనా ఆక్రమణలో ఉంది. 1950వ దశకం చివరలో చైనా అక్సాయ్ చిన్ ద్వారా జిన్జియాంగ్-టిబెట్ హైవే (G219) నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 1962 భారత-చైనా యుద్ధానికి ఈ హైవే కారణం అయ్యింది. ఇప్పుడు రైల్వే లైన్ నిర్మాణానికి పూనుకోవడం ఆందోళనలను కలిగిస్తుంది. ఇది భారతదేశ అక్సాయ్ చిన్ గుండా వెళ్లడంతో పాటు LACకి దగ్గరగా ఉంటుంది. ఇది సైనిక దళాలను మోహరించడానికి, సరిహద్దు ప్రాంతానికి వేగంగా యుద్ధ సామాగ్రిని సమీకరించడానికి సహాయపడుతుంది.
అరుణాచల్ సరిహద్దు నుంచి చెంగ్డూకు రైలు మార్గం
2006లో టిబెట్ కు రైల్వేను ప్రారంభించినప్పటి నుంచి, మరో రెండు లైన్లు వచ్చాయి. 2014లో లాసా-షిగాట్సే రైలు, 2021లో లాసా-నైంగ్చి మార్గం ఏర్పాటు చేసింది చైనా. లాసా-నైంగ్చి మార్గం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపు ఆగ్నేయంగా వెళుతుంది. పశ్చిమ చైనాలో ప్రధాన సైనిక కేంద్రంగా ఉన్న చెంగ్డు వరకు దీనిని తూర్పున విస్తరించే చర్చలు జరుగుతున్నాయి. బీజింగ్ ఇప్పుడు టిబెట్ లో నుంచి రైల్వే ట్రాక్ లను ఏర్పాటు చేస్తోంది. భారతదేశ తూర్పు సెక్టార్ లో చైనా రైలు ఉత్తర సరిహద్దు దగ్గరికి రానుంది. ఇది మన దేశానికి ఆందోళన కలిగించే విషయం.
LAC సమీపంలో చైనా జిన్ జియాంగ్-టిబెట్ రైలు
చైనా జిన్ జియాంగ్-టిబెట్ రైల్వే ఈ లైన్ వాయువ్య జిన్‌జియాంగ్ ప్రావిన్స్ ను టిబెట్‌తో కలుపుతుంది. ప్రాజెక్ట్ లోని కొన్ని భాగాలు LAC సమీపంలో నడుస్తాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ రైల్వే లైన్ పనులు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన జిన్‌జియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ ఈ పనులను పర్యవేక్షిస్తుంది. ఇది 95 బిలియన్ యువాన్ల (13.2 బిలియన్ డాలరల్ల)తో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టు 2035 వరకు అందుబాటులోకి రానుంది.
1962 యుద్ధానికి చైనా రోడ్డు నిర్మాణం ఎలా దారి తీసింది?
1962 ఇండో-చైనా యుద్ధానికి కారణం బీజింగ్ అక్సాయ్ చిన్ ద్వారా G219 హైవే నిర్మాణం. 1959లో ఈ రోడ్డు నిర్మాణం మొదలయ్యింది. ఈ రోడ్డు చైనాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇది జిన్జియాంగ్, టిబెట్ ను అనుసంధానించింది. చైనా మ్యాప్ లలో కనిపించే వరకు భారత్ కు ఈ హైవే గురించి తెలియదు. ఈ విషయం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. అక్సాయ్ చిన్ భారతదేశంలో అంతర్భాగం. కానీ, చైనా ఆక్రమించుకుంది. ఈ రోడ్డు నిర్మాణాన్ని సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. 1962 యుద్ధం జరిగింది. చైనా సైనిక దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి చైనా ఇప్పటికే ఉన్న G219 హైవేకి అనుసంధానిస్తూ కొత్త రహదారులను కూడా నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో వేగంగా దళాల సమీకరణ, మోహరింపును లక్ష్యంగా చేసుకుంది.
ఇప్పుడు చైనా భారతదేశ సరిహద్దుల్లో నిర్మిస్తున్న రైల్వే లైన్ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు సైన్యాన్ని, సామాగ్రిని త్వరగా తరలించేలా చైనాకు ఉపయోపడనుంది. పెరిగిన భద్రతా ప్రమాదాల దృష్ట్యా ఈ పరిణామాలు భారత్ లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. భారత్ ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: ఇండియన్ రైల్వే రౌండ్ ట్రిప్ స్కీమ్, డిస్కౌంట్ కోసం ఇలా ట్రై చేయండి!