Karimnagar: కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సిఎం రేవంత్ రెడ్డి.. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క కార్పొరేషన్ పై దృష్టి పెట్టడం అరుదు. అయితే అక్కడ కాంగ్రెస్ ఎగురవేయాలని.. పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో బిజెపితో పాటు బీఆర్ఎస్ గట్టిగా ఉంది. గత రెండు సార్లు మేయర్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో.. మేయర్ సీటు సాధించాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారంట. అయితే అక్కడ బలమైన నేత లేకపోవడంతో సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారంట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఎంపిగా పోటీ చేసిన రాజేందర్రావుకు గెలుపు బాధ్యతలు అప్పజెప్పారంటున్నారు
2005లో కరీంనగర్ మేయర్ సీటు కైవసం చేసుకున్న కాంగ్రెస్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2005 లో ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్‌కి పూర్తి మెజారిటీ రానప్పటికీ.. ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్ల సహాకరంతో మేయర్ సీటును కైవసం చేసుకుంది. తరువాత పదేళ్లకు 2015లో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు గులాబీ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది. కాంగ్రెస్ 14 కార్పొరేటర్ సీట్లకు పరిమితమైంది. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో 13 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. దాంతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది.
2020 కార్పొరేషన్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్
కరీంనగర్ మున్పిపల్ కార్పొరేషన్‌కు 2020లో జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. అక్కడ మరోసారి బిఆర్ఎస్ తన అధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు బీజేపీ బిజెపి ఆ ఎన్నికల్లో 13 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకుని గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారైంది. కాషాయపార్టీ మెజారిటీ స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. అదే విధంగా 2014, 2018, 2023 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.
బీఆర్ఎస్‌పై వరుసగా 2 సార్లు గెలిచిన బండి సంజయ్
మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా.. కరీంనగర్లో అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ ఓట్లు సాధించలేకపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత కరీంనగర్‌లో కాంగ్రెస్ ఉనికి లేనట్టు తయారైంది. 2014లో టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచిన బి.వినోద్‌కుమార్‌కు తర్వాత రెండు సార్లూ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ చెక్ పెడుతూ వచ్చి .. ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
కరీంనగర్ పార్టీ పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం కరీంనగర్‌లో సమర్ధుడైన నాయకుడు లేక బలోపేతం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారంట. కరీంనగర్‌లో బలమైన నేత కరువయ్యారని గుర్తించారంట. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్.. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో ఫోకస్ చేయలేకపోతున్నారు. దాంతో సీం నేరుగా రంగంలోకి దిగారంట.
రాజేంద్రరావుకి గెలుపు బాధ్యతలు అప్పజెప్పిన రేవంత్‌రెడ్డి
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి పరాజయంపాలైన రాజేంద్రరావును.. సిఎం హైదరాబాదు కి పిలిపించుకుని.. ఖచ్చితంగా.. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేయాలని సూచిస్తూ… ఇక్కడి పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారంట. ఇప్పటికీ అక్కడ బిఆర్ఎస్, బిజెపి బలంగా ఉన్నాయి. రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్,కేంద్ర మంత్రి బండిసంజయ్‌లు కూడా కరీంనగర్ కార్పొరేషన్‌పై పట్టు సాధించాలని, ఎలాగైనా మేజారిటి స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠం కైవసం చేసుకొవాలని పట్టుదలతో ఉండటంతో… ఇప్పుడు ఇదే కరీంనగర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్‌ను బలహీనపర్చడానికి కాంగ్రెస్ చెక్
అయితే పలు సర్వేలు కూడా బీఅర్ఎస్, బీజేపి లు కరీంనగర్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయని చెబుతున్నాయి. ఆ క్రమంలో మొదట బీఆర్ఎస్‌ను బలహీనం చేయాలని కాంగ్రెస్ స్కెచ్ గీస్తోందంట. ఆ లెక్కలతోనే రాజేంద్రరావు డివిజన్ల వారీగా ముఖ్య నేతలను కలుస్తున్నారు. కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి.. 50 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాజేంద్రరావు అందర్నీ ఆదేశిస్తున్నారు. అంతేకాదు.. ప్రతి 15 రోజులకు ఒక్కసారి సిఎంకు రిపోర్ట్ అందిస్తున్నారు. గతంలో.. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందే సదరు పనులను పూర్తి చేస్తానని సిఎం హామీ ఇచ్చారంట.
Also Read: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..
బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండేలా వ్యూహరచన
ఇప్పటికే పెండింగ్ పనుల వివరాలు కాంగ్రెస్ పెద్దలు సేకరిస్తున్నారు. సర్వేలపై దృష్టి పెడుతున్నారు. మరో నెల రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీగా ఉండే.. వాతవారణం సృష్టించాలని వ్యూహరచన చేస్తున్నారంట.. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్‌తో టచ్ లోకి వస్తున్నారు. అక్కడ పాగా వేస్తే బీజేపీ దూకుడు తగ్గించవచ్చనే సిఎం కూడా భావిస్తున్నారంట. మొత్తమ్మీద ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై దృష్టి పెట్టి.. నేతలను పరుగు పెట్టిస్తున్నారు. పూర్తిగా రాజేందర్ రావుకు గెలుపు బాధ్యతలు అప్పజెప్పారంట. జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ వ్యవహారాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారంట. ఏదేమైనా మరింత స్పీడ్ ని పెంచి.. కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగురువేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.
Story By Rami Reddy, Bigtv