Indian Railways: కోతులు చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి నవ్వు కలిగిస్తే, మరోసారి చిరాకు కలిగిస్తాయి. తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలు నిలిపోయేలా చేసింది. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ స్టేషన్‌లో జరిగింది. నాల్గవ నంబర్ ప్లాట్ ఫారమ్ మీద రెండు కోతులు గొడవపడి రైళ్లు ఆగిపోయేలా చేశాయి. ఇంతకీ అసలు కోతులు ఏం చేశాయి? రైళ్లు ఎందుకు ఆగిపోయాయంటే?
విద్యుత్ వైర్ల మీద పడ్డ అరటిపండు
బీహార్‌లోని సమస్తిపూర్ లో సాధారణంగా కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. స్థానిక రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులు ఇచ్చే ఫుడ్ ఐటెమ్స్ కోసం ఎక్కువగా కోతులు వస్తుంటాయి. రైల్వే అధికారులు సైతం కోతులకు ఆహార పదార్థాలు వేయకూడదని చెప్తూనే ఉన్నారు. తాజాగా సమస్తిపూర్ స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్ ఫారమ్ మీద రెండు కోతులకు ఓ అరటి పండు దొరికింది. దాని కోసం రెండు కోతులు కొట్లాడుకున్నాయి. అదే సమయంలో ఓ కోతి అరటిపండును తీసుకుని స్టేషన్ మీదికి ఎక్కింది. దాన్ని ఫాలో అవుతూ మరో కోతి పైకి వెళ్లింది. రెండూ పైన మరోసారి ఫైట్ చేశాయి. ఇద్దర మధ్యలో ఆ అరటిపండు జారి విద్యుత్ లైన్లమీద పడింది. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి తీగల నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. వైర్ల నుంచి పొగలు వచ్చాయి. వెంటనే రైల్వే స్టేషన్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిలిచిపోయిన పలు రైళ్లు
సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. కొద్దిసేపు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఎలక్ట్రికల్ అధికారులు పరిశీలించి ఓవర్ హెడ్ ఎక్విప్ మెంట్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. సుమారు గంట తర్వాత విద్యుత్ వైర్లను సరి చేశారు. ఆ తర్వాత రైలు సేవలను పునరుద్దరించారు. ఈ ఘటన కారణంగా సుమారు అర డజన్ రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా ప్రారంభం కావడంతో మళ్లీ యథావిధిగా రైళ్లు తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాయి.
కోతులు రాకుండా చర్యలు
ఈ ఘటనపై RPF ఇన్‌స్పెక్టర్ వేద్ ప్రకాష్ వర్మ తన బృందంతో కలిసి ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రదేశం నుంచి ప్రయాణీకులను దూరం పంపించినట్లు వెల్లడించారు. రైళ్ల రాకపోవకలకు తీవ్ర ఇబ్బంది కలగడానికి కారణం కోతుల మధ్య కొట్లాట అని చెప్పారు. కాసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగినట్లు తెలిపారు. వాస్తవానికి ఈ స్టేషన్ లో కోతుల బెడద ఉన్నట్లు గుర్తించామన్నారు. స్టేషన్ పరిసరాల్లోకి కోతులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ప్రయాణీకులు వాటికి ఫుడ్ ఇవ్వడం కారణంగా కొన్ని కోతులు స్టేషన్ ను వదిలి వెళ్లిపోవడం లేదన్నారు. అందుకే, ప్యాసెంజర్లు వాటికి ఫుడ్ ఇవ్వకూడదని సూచిస్తున్నారు వేద ప్రకాష్.
Read Also: అర్థరాత్రి వరకు సిగ్నలింగ్ ఇబ్బందులు, తెలంగాణలో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం!