Japan Doraemon Railway Station: డోరేమాన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల చేతికి టీవీ రిమోట్ చిక్కితే చాలు ఫస్ట్ పెట్టేది కార్టూన్ ఛానెల్స్. వాటిలో అత్యంత ఇష్టమైన షో డోరేమాన్. చలాకీ పిల్లాడు చేసే క్రేజీ పనులు పిల్లలను ఎంతో ఆకట్టుకుంటాయి. డోరేమాన్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలనుకుంది జపాన్ రైల్వే సంస్థ. ఏకంగా ఆ కార్డూన్ థీమ్ తో ఏకంగా ఓ రైల్వే స్టేషన్ ను రూపొందించింది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంతకీ అది ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? అనేది వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నోబోరిటో స్టేషన్.. డోరేమాన్ స్టేషన్!
జపాన్ లోని నోబోరిటో స్టేషన్ (Noborito Station)ను డోరేమాన్ థీమ్డ్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దారు రైల్వే అధికారులు. తాజాగా ఈ స్టేషన్ కు సంబంధించిన వీడియోను ఓ యూట్యూబర్ షేర్ చేసింది. అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ స్టేషన్ టోక్యో సమీపంలోని కవాసాకి- కనగావా ప్రిఫెక్చర్ మధ్యలో ఉంది. ఓడక్యూ లైన్ (Odakyu Line)లో భాగంగా కొనసాగుతోంది. దీనిని చాలా మంది డోరేమాన్ స్టేషన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే, ఇది డోరేమాన్ సృష్టికర్తలైన ఫుజికో F. ఫుజియో సొంతూరుకు సమీపంలో ఉంది. దీనికి దగ్గరలోనే ఫుజికో F. ఫుజియో మ్యూజియం కూడా ఉంది.
డోరేమాన్ థీమ్ రైల్వే స్టేషన్ విశేషాలు
2009లో ఫుజియో 100వ జయంతి సందర్భంగా ఈ స్టేషన్‌ను డోరేమాన్ థీమ్ తో రెన్నొవేషన్ చేశారు. స్టేషన్ లోని సైన్‌బోర్డ్ లు, టాయిలెట్ జెండర్ సైన్ లు, గోడలపై చిత్రాలు, వెయిటింగ్ సీట్లు సహా అన్నీ డోరేమాన్ థీమ్ తో అలంకరించబడ్డాయి. డోరేమాన్ ప్రసిద్ధ ఎనీవేర్ డోర్, డోరేమాన్ రీ సైకిల్ పెట్ బాటిల్ బాక్స్, రైలు జింగిల్ గా డోరేమాన్ థీమ్ సాంగ్ కూడా ఇక్కడ ప్లే చేస్తారు. డోరేమాన్ స్టేషన్ ను చూడాలి అనుకునే వారు షిన్జుకు స్టేషన్ నుంచి ఓడక్యూ లైన్ ద్వారా 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. JR నంబు లైన్ ద్వారా తచికావా, మిజునోకుచి నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ స్టేషన్ సందర్శన డోరేమాన్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తోంది. అంతేకాదు, జపాన్ లో డోరేమాన్ థీమ్డ్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. సీబు రైల్వేకు చెందిన డోరేమాన్-గో రైళ్లు షిన్జుకు, తమకో, హైజిమా లైన్లలో నడుస్తున్నాయి. ఈ రైళ్లు కూడా డోరేమాన్ డిజైన్ లతో అలంకరించబడ్డాయి.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
సోషల్ మీడియాలో షేర్ చేసిన డోరేమాన్ థీమ్ రైల్వే స్టేషన్ వీడియో 2 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. “ఈ రైల్వే స్టేషన్ ను ఒక్కసారి అయినా సందర్శించాలనేది నా కల” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “నేను కూడా జపాన్ కు వెళ్లాలి అనుకుంటున్నాను. అప్పుడు తప్పకుండా ఈ స్టేషన్ కు వెళ్తాను. చాలా అందంగా ఉంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “నేను షింజుకుకు వెళ్ళాను. కానీ, దీనికి గురించి నాకు తెలియక మిస్ అయ్యాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.