East Coast Railway: ఏప్రిల్ చివరి వారంలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండకు మంటగాలులు, ఉక్కపోత తోడుకావడంతో జనాలు అల్లాడిపోతున్నారు. పొద్దున్నే 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. అటు వేసవి సెలవులు కావడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి వెకేషన్స్ కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఎండ నుంచి ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చల్లటి మంచి నీరు సహా ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు.
వాల్తేరు రైల్వే డిజన్ అధికారుల కీలక నిర్ణయం
వేసవి ఉష్ణోగ్రతలు, సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని ప్రధాన స్టేషన్లలో అదనపు సౌకర్యాలు, భద్రత, సజావుగా కార్యకలాపాలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని స్టేషన్ల అధికారులను డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఆదేశాలు జారీ చేశారు.
అన్ని స్టేషన్లలో తాగునీరు వసతులు
ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అన్ని ప్రధాన స్టేషన్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తో పాటు మట్టికుండలలో నీరు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు తాగునీటిని అందించేందుకు వాటర్ బూత్ లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అన్ని చోట్లా నీరు అందుబాటులో ఉండేలా సిబ్బంది క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని తెలిపారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ లో స్వచ్ఛంద సంస్థ సాకారంతో ప్లాట్ ఫారమ్‌ల చివర్లలో ఉచిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా జనరల్ కోచ్ ప్రయాణీకులకు సేవలను అందించడానికి వీటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కూడా తాగునీటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.స్టేషన్లలో సురక్షితమైన తాగునీరు అందించేందుకు సివిల్ డిఫెన్స్ సిబ్బంది, స్కౌట్స్ & గైడ్స్ స్టేషన్లలో పని చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: హైదరాబాద్ మెట్రో.. సరికొత్త యాప్, ఇది ఎలా పనిచేస్తుందంటే?
సురక్షితంగా ప్రయాణాలు కొనసాగించేలా చర్యలు
అన్ని స్టేషన్లలోని టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లలో రన్నింగ్ వాటర్ లభ్యత, రైళ్ల రాకపోకలకు సంబంధించి సకాలంలో ప్రకటనలు, సరైన క్యూ మెయింటెనెన్స్, రద్దీ సమయాల్లో బోర్డింగ్, డీబోర్డింగ్ క్రమబద్ధీకరించడానికి హోల్డింగ్ ప్రాంతాలను నియమించడం కోసం అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, కాన్కోర్స్ ప్రాంతాలలో జనసమూహ కదలికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సజావుగా, సురక్షితంగా ప్రయాణీకులు తమ ప్రయాణాలను కొనసాగించేలా తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రయాణీకులు రైల్వే సిబ్బందితో సహకరించాలని కోరారు. అదే సమయంలో ప్రతి ప్రయాణీకుడు స్వంత భద్రత, సౌలభ్యం కోసం రైల్వే మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
Read Also: హైదరాబాద్ మెట్రో కొత్త రూట్స్, రాబోయే స్టేషన్లు ఇవే.. మీ ఏరియా ఉందేమో చూడండి!