Ellamma temple Chandragiri: మద్యం మానేయాలనుకునే ప్రతి ఒక్కరికి అగ్ని సాక్షిగా ప్రమాణం చేయించే ఆలయం ఇది. సాధారణంగా దేవాలయాల్లో భక్తులు మొక్కులు చెల్లించేందుకు వెళ్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న చంద్రగిరి సమీపంలో ఉన్న మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయం మాత్రం భక్తుల అలవాట్లనే మారుస్తోంది. ముఖ్యంగా మద్యం మానేయాలనుకునే భక్తులు ఇక్కడకు భారీగా వస్తారు. ఎందుకంటే అమ్మవారికి అగ్నిపై ప్రమాణం చేసి మద్యం మానిపోతే.. మళ్లీ ఆ అలవాటు పట్టదన్న నమ్మకం.
వేప చెట్టు కింద ప్రారంభమైన పుణ్యక్షేత్రం
ఈ ఆలయం చరిత్రలోకి వెళ్లితే, అసలైన మూలస్థానం వేప చెట్టు కింద ప్రారంభమైంది. అదే ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఉంది. ప్రతీ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఆ తీర్తాన్ని భక్తులు తమపై చల్లుకుంటారు. అలా చేస్తే శరీర రోగాలు, మానసిక కలతలు పోతాయనే విశ్వాసం ఉంది. ఇదే విశ్వాసం ఇప్పుడు మద్యపానం వంటి చెడు అలవాట్లను విడిచి పెట్టేందుకు భక్తులకు శక్తినిస్తోంది.
ముందుగా స్నానం.. తరువాత అగ్ని ప్రమాణం
ఇక్కడ మద్యం మానేయాలనుకునే వారు ముందుగా ఆలయం వద్ద స్నానం చేస్తారు. అనంతరం పూజా సామగ్రి తీసుకొని అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. దానంతరం ఆలయ పూజారులు వారిని అగ్ని సాక్షిగా ప్రమాణం చేయిస్తారు. ఆలయంలో ప్రత్యేకంగా వెలిగించిన దీపంపై చేతులు ఉంచి ఇకపై మద్యం ముట్టను అని శపథం చేస్తారు. ఇది చిన్న విషయం అనిపించినా, దీని ఫలితాలు అద్భుతమని అనేక మంది చెప్పుకుంటున్నారు. ఒక్కసారి దీపంపై ప్రమాణం చేసినవారిలో మద్యం పట్ల ఆసక్తి తగ్గిపోయిందట!
Also Read: Clay Pots: మట్టితో ఇలా కూడా చేయవచ్చా! ఇక ఫ్రిజ్ లు విసిరి వేయాల్సిందేనా
పాదయాత్రలతో వస్తున్నారు భక్తులు!
తమ జీవితాల్లో మద్యం వల్ల తలెత్తిన సమస్యలు తాలూకు బాధను ఎల్లమ్మ తల్లికి విన్నవించేందుకు చాలా మంది భక్తులు పాదయాత్రలతో ఇక్కడకు వస్తున్నారు. కొందరు రాక ముందు మద్యం మానేస్తారు. మరికొందరు ఇక్కడ ప్రమాణం చేస్తే మాత్రం మానిపోతుందనే నమ్మకంతో వస్తారు. ఆలయ పూజారులు సైతం వారిని నడిపిస్తూ, మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ, అమ్మవారి చింతనలో బతికేలా మారుస్తున్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాక, జీవన మార్గంలో దారి తప్పినవారికి నిజమైన మార్గదర్శకంగా మారింది.
దేవాలయం కంటే మానసిక చికిత్స కేంద్రమే!
ఈ ఆలయాన్ని చూస్తే.. ఇది కేవలం మత స్థలమే కాదు, ఒక రకాల మానసిక పునరావాస కేంద్రం అని చెప్పొచ్చు. ఎవరైనా మారాలనుకునే భావనతో వస్తే, అమ్మవారి ఆత్మబలంతో ఆ మార్పు సాధ్యమవుతోంది. మానవ సంబంధాలు ధ్వంసం అయ్యాక, ఆరోగ్యం క్షీణించిన తర్వాత, చివరికి కుటుంబం చెదిరిపోయిన తర్వాత, తమ తప్పును గ్రహించినవారు ఇక్కడ వచ్చి మొక్కుతుంటారు. ఆ మొక్కు వాళ్ల జీవితాన్ని మళ్లీ నిర్మిస్తోందంటే ఇది దేవీ శక్తి కాక మరేమిటి?
ఆలయ విశిష్టతలు..
ఈ ఆలయం ఎక్కడో హిమాలయాల్లో కాదు.. మనకు చుట్టుపక్కలే ఉంది. తిరుపతి ప్రాంతంలోనే ఉండటంతో ప్రతి శుక్రవారం ఆలయం వద్ద భక్తుల రద్దీ చూస్తే అర్థమవుతుంది.. ఈ విశ్వాసానికి ఎంత బలం ఉందో! రాహుకాలంలో చేసే అభిషేకంతో పాటు, ప్రమాణ పూజలు, దీపారాధన చాలా విశిష్టంగా జరుగుతాయి. మహిళలు, పురుషులు, యువకులు ఇలా వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఇక్కడ ఈ శపథ పూజలో పాల్గొంటున్నారు.
ఇక్కడ మద్యం మానిపోవడం కేవలం భయంతో కాదు.. నమ్మకంతో. జీవితాన్ని మార్చాలనుకునే ఓ ప్రారంభ బిందువుగా ఎల్లమ్మ తల్లి ఆలయం నిలుస్తోంది. దీపంపై చేతులు పెట్టిన భక్తులు మద్యం దూరం చేస్తే.. జీవితాన్ని తుడిపాటి పెడతానన్న వారిని.. దేవి ఒక్క ఆశీర్వాదంతో మారుస్తుందంటే.. అది మానవ విశ్వాసానికే గర్వకారణం.