Indian Railways frauds: ఇటీవల ఇండియన్ రైల్వేలో అసలు టీటీఈలతో కంటే.. నకిలీ టీటీఈల హడావుడి కూడా ఎక్కువవుతోంది. నిజమైన టీటీఈల మాదిరిగా బ్లాక్ కోటు వేసుకుని, టికెట్ ప్లీజ్ అంటూ ముందుకొస్తే ఎవరికైనా రైల్వే అధికారిగా అనిపించకమానదు. కానీ ఆ డ్రస్ వెనక ఉన్న వాస్తవం తెలిసేలోపే.. చాలా మందికి జేబులు ఖాళీ అవుతుంటాయి. ఫేక్ టీటీఈలు ప్రయాణికులపై తమ ప్రభావం చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది గమనించనంత వరకూ, ఎన్నో వేల మంది బాధితులుగా మారిపోతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల చాలా వరకు వెలుగులోకి వచ్చాయి.
యాక్టింగ్ లో వీరు.. ఉత్తమ నటులే!
ఫేక్ టీటీఈల పనితీరు చూస్తే, నిజంగా మంచి నటుల్లా పని కానిచ్చేస్తున్నారు. టికెట్ చెక్ చేయడంలా నటిస్తూ, రూల్ బ్రేక్ చేశారు, ఇది రిజర్వ్ సీట్ కాదు, ఇక్కడ కూర్చోవాలంటే ఫైన్ పడుతుంది అంటూ ప్రయాణికులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు లిస్టు చూసే అవసరం లేకుండా, ముందుగానే భయపెట్టి డబ్బులు తీసేస్తారు. ఇలా ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, విద్యార్థులు టార్గెట్ అవుతున్నారని చెప్పవచ్చు.
ఒరిజినల్ టీటీఈలు ఎలా ఉంటారంటే?
అసలైన టీటీఈలంటే వారు కేవలం బ్లేజర్ వేసుకుని తిరిగే వ్యక్తులు కాదు. వారిని గుర్తించడానికి కొన్ని స్పష్టమైన గుర్తింపులు ఉన్నాయి. మొదటగా, అసలైన టీటీఈ దగ్గర అధికారిక రైల్వే ఐడీ కార్డు ఉండాలి. అందులో వారి ఫోటో, పేరు, ఉద్యోగ నంబర్, పోస్టింగ్ స్టేషన్ వివరాలు ఉంటాయి. అదీ కాకుండా, వారి చేతిలో హ్యాండ్ హెల్డ్ టర్మినల్ (HHT డివైస్) ఉంటుంది. ఈ డివైస్ ద్వారా వారు టికెట్లు స్కాన్ చేస్తారు. అలాగే అసలైన టీటీఈ ఎప్పుడూ ముందుగానే లిస్టులో మీ పేరు తెలుసుకుని టికెట్ చెక్ చేస్తారు. కానీ ఫేక్ టీటీఈలు మిమ్మల్ని అడిగే దాకా ఏమాత్రం సమాచారం వారి వద్ద ఉండదు. పైగా అసలైన టీటీఈ డబ్బులు తీసుకుంటే తప్పకుండా రసీదు ఇస్తారు. ఫేక్ టీటీఈ దగ్గర అయితే ఎటువంటి రసీదు ఉండదు.
Also Read: Snake bite viral video: పాముతో గేమ్స్.. మెడలోకి వేసి మరీ రెచ్చగొట్టాడు.. చివరికి?
ఇటీవల ఫేక్ టీటీఈల హడావుడి ఎక్కువగా కనిపించింది ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో. ఉదాహరణకి, వారణాసి-న్యూఢిల్లి రైల్లో ముగ్గురు వ్యక్తులు టీటీఈల మాదిరిగా డ్రస్ వేసుకుని, ప్రయాణికుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేశారు. అసలైన టీటీఈ రాగానే వారు దిగిపోయారు. మరో ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని వద్ద టికెట్ తప్పుడు డిటెయిల్స్‌తో ఉంది అంటూ రూ.500 వసూలు చేశారు. తరువాత అసలైన టీటీఈ వచ్చి ఇది మోసం అని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
టీటీఈ వస్తే.. తప్పక ఇలా చేయండి!
ఈ తరహా మోసాలను నివారించాలంటే ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా టికెట్ చెక్ చేస్తే.. మొట్టమొదటగా వారి ID కార్డు చూపించమని అడగాలి. అతను డబ్బులు అడిగితే తప్పకుండా రసీదు ఇవ్వాలని అడగాలి. ఫోన్‌లో 139 రైల్వే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఆ వ్యక్తి నిజమైన టీటీఈనా కాదా అని తెలుసుకోవచ్చు. అదే విధంగా మీ దగ్గర టికెట్, ఐడీ ప్రూఫ్ ఉంటే ఎటువంటి భయానికి లోనవ్వాల్సిన అవసరం లేదు.
ఈ మధ్యకాలంలో రైల్వే డిపార్ట్‌మెంట్ కూడా అలర్ట్ అయింది. ఫేక్ టీటీఈలను పట్టుకునేందుకు RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. కొన్ని చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి అనుమానాస్పదంగా తిరిగే వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయినా ప్రయాణికులు తమ వంతుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మొత్తం మీద, రైల్లో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ.. టికెట్ ప్లీజ్ అన్న ఒక్క మాటకి తడబాటు చెందకుండా, ఆ వ్యక్తి గురించి ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే, మీ డబ్బు, మీ ప్రయాణ భద్రత, ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి!
ముఖ్య గమనిక: అసలైన టీటీఈలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం ప్రయాణికుల భాద్యత. గౌరవం ఇద్దాం.. అదే గౌరవాన్ని తిరిగి పొందుదాం.